హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అవినితీ చేయలేదని సర్కారు పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం టెండర్ల స్కాంపై న్యాయ విచారణ జరిపించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టెండర్లలో నాలుగు కంపెనీలు పాల్గొంటే, రెండు కంపెనీలకే రూ.65.9 కోట్ల పెనాల్టీ వేయడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. మిగిలిన రూ.320 కోట్లు ఎందుకు జప్తు చేయడంలేదని నిలదీశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు బిడ్డర్లతో కుమ్మక్కయ్యే అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు.
వేలకోట్ల రూపాయలు దండుకొని ఇప్పుడు మన్నుతిన్న పాముల్లా మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల ఆదేశాల మేరకే ధాన్యం టెండర్ల ఫైల్ క్యాబినెట్‌కు చేరిందని, దిక్కుతోచని పరిస్థితుల్లో బిడ్డర్ల నుంచి నగదు రికవరీ కోసం జీవో-15 జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే తప్పించుకొనేందుకే కేవలం రూ.65.9 కోట్ల జప్తునకు చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. మిగిలిన సొమ్ములో సీఎం, మంత్రులకు వాటాలు ఉన్నందుకే విస్మరించారని దుయ్యబట్టారు.
ధాన్యం టెండర్లలో అవకతవకలు జరిగాయనడానికి రూ.65.9 కోట్లు జప్తు చేయాలని క్యాబినెట్ నిర్ణయించడమే నిదర్శనమని పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్టు తెలిసినా సివిల్ సైప్లె శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము అన్ని ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. ధాన్యం టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు క్వింటాల్‌కు అదనంగా రూ.230 చొప్పున మిల్లర్ల నుంచి వసూలు చేశారని, కమీషన్ సొమ్మును కాంగ్రెస్ పెద్దలకు ముట్టజెప్పారని ఆరోపించారు. 20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు నిబంధల ప్రకారం 90 రోజుల్లో ఎత్తాలని, కానీ 700 రోజులు దాటినా పట్టించుకోకపోవడంతో సుమారు రూ.450 కోట్లు సర్కారు ఖజానాకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ కంపెనీతో కుమ్మక్కయిందని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అందుకే 2022లో సన్నధాన్యం కొనుగోలు బాధ్యతను సదరు కంపెనీకి అప్పగించిందని పేర్కొన్నారు. నిరుడు వానకాలంలో 25 లక్షల టన్నులు, యాసంగిలో 19 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు బాధ్యతలను సదరు సంస్థకే కట్టబెట్టిందని చెప్పారు. కంపెనీ బాధ్యులకు ప్రభుత్వ పెద్దలు వంతపాడే టెండర్లు ఇచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వై సతీశ్‌రెడ్డి, పల్లె రవికుమార్, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ సభ్యుడు గోసుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సివిల్ సైప్లె శాఖలో ఇంత అవినీతి జరుగుతుంటే ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనం దాల్చడం దుర్మార్గమని పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అనేకసార్లు ఈడీ, ఏసీబీకి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పాపపు సొమ్ములో వాటాలున్నందునే మంత్రి మిన్నకుంటున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ అసెంబ్లీలో ప్రశ్న అడిగేందుకు యత్నించినా దురుద్దేశపూర్వకంగానే అవకాశం రాకుండా చేశారు. కోర్టులో కేసు వేస్తే వాయిదాలతో తప్పించుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాచారమివ్వకుండా దాచిపెడుతున్నారు’ అని ఆరోపించారు.