హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రూ.31 వేలకోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.18 వేలకోట్లతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని, రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయకుంటే ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, పల్లెరవితో కలిసి పెద్ది మీడియా సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. హరీశ్‌రావు పనితనాన్ని తప్పుపట్టే నైతిక అర్హత పొన్నం ప్రభాకర్‌కు లేదని తేల్చిచెప్పారు.
రైతుల పక్షాన హరీశ్‌రావు మాట్లాడితే పొన్నం సహా మంత్రులు పిచ్చి కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవంగా రుణమాఫీకి రూ.45 వేలకోట్లు అవసరమని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పా రు. కానీ లెక్కలను చెప్పేందుకు ప్రభుత్వం జకుంతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ కాల్‌సెంటర్‌కు రుణమాఫీపై ఇప్పటికే 75 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, రుణమాఫీ కాని రైతుల పక్షాన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. చేయని తప్పులకు రైతులను, సహకార సం ఘాలను ప్రభుత్వం బాధ్యులను చేస్తోందని, నల్లబెల్లి మండలంలో రైతులు, సహకార సంఘాలను క్రిమినల్స్‌లా చిత్రీకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నదని విమర్శించారు.
రవాణా శాఖలో ప్రతి జిల్లాకు కోటి చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని, పౌర సరఫరాలశాఖలో 1832 కలెక్షన్ సెంటర్లు పెట్టి మిల్లర్లను వేధిస్తున్నారని, బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.75 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 3.24 లక్షల కోట్లే అప్పు అయినట్టు హరీశ్‌రావు గణాంకాలతో సహా చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే 50 వేలకోట్ల అప్పు చేసిందని, పొన్నం పిచ్చి కూతలు బంద్ చేయాలని, సమాధానం చెప్పే ధైర్యం సీఎంకు, మంత్రులకు లేదని ఎద్దేవా చేశారు.
వయసు పెరిగింది.. బుద్ధి పెరగలే : ఎర్రోళ్ల
మంత్రి పొన్నంకు వయసు పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బురద జల్లడం తప్ప పొన్నం చేస్తున్నదేమీ లేదని దెప్పిపొడిచారు. అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ అని, కలెక్షన్ సెంటర్ల గురించి పొన్నం మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. రవాణా శాఖ లో అవినీతి జరగలేదని పొన్నం శ్వేతపత్రం విడుద ల చేయగలరా? అని ప్రశ్నించారు. కరప్షన్, కలెక్షన్ కాంగ్రెస్ విధానమని విమర్శించారు.
కేసీఆర్ హ యాంలో ఒక బస్సూ కొనలేదని పొన్నం అంటున్నారని, కేసీఆర్ హయాంలో ఎన్ని బస్సులు కొనానరో సజ్జనార్‌ను అడిగి తేలుసుకోవాలని హితవుపలికారు. 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలైన ఒలెక్ట్రా, జేబీఎంకు ధారాదత్తం చేసింది కాం గ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆర్టీసీకి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీనైనా కాంగ్రెస్ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్‌కు కట్టబెట్టడంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై సీబీసీఐడీ దర్యాప్తునకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే రూ.2100 కోట్ల నష్టంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ ఎద్దేవాచేశారు.