హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. యూరియా కొరతకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను తీర్చలేకపోతుందని మండిపడ్డారు. యూరియా దొరకక, పంటల్లో ఎదుగుదల లేక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉన్నదని అన్నారు. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు ముందస్తు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జిల్లాలకు జిల్లాలే వరదనీటిలో మునిగిపోయే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లలో దాదాపు రూ.400 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న మరో కుంభకోణాన్ని త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ కుంభకోణంలో సీఎం, సంబంధిత మంత్రులకు ఉచ్చు బిగుస్తుందని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు పక్కగా ఉన్నాయని తేల్చిచెప్పారు.
ఒకవేళ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలకు క్యాబినెట్ మొత్తం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ విధంగా అష్టదిగ్బంధంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూరుకుపోయిందని ఆయన స్పష్టంచేశారు. రూ.400 కోట్ల ఈఎండీ బిడ్డర్ల నుంచి రూ.68 కోట్లను జప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పు చేసిన బిడ్డర్లను కాపాడిన మంత్రులు జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాసరాజు, కల్వకుర్తి శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.