హైదరాబాద్ జూన్ 17 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా గుర్తుకువస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు కష్టాల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలిచేందుకు రైతుబంధు వేస్తే.. నేడు రైతుభరోసాను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతు రుణమాఫీ కాక, రైతుభరోసా అందక, ధాన్యం కొనేవారు లేక అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా పేరిట సరికొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. బజారు భాష మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమయ్యాయని, కానీ సీఎం, మంత్రులు ఏదో ఉద్ధ్దరించామంటూ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ తెచ్చిన తెలంగాణతో నీకేం సంబంధం?
కేసీఆర్ పెట్టిన సర్పంచుల బిల్లులతో తమకు సంబంధంలేదని ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బిల్లులతో సంబంధంలేకుంటే మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణతో, ఆయన కట్టిన సచివాలయంతో ఏం సంబంధమని నిలదీశారు. రాష్ట్రం రాక ముందు ఏటా 17 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే దానికి 20 రెట్లు ఎక్కువగా అంటే మూడు కోట్ల టన్నులు సేకరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రూ.12 వేలకు తగ్గించి, రెండుసార్లు ఎగ్గొట్టి దగా చేసిందని దుయ్యబట్టారు. ఎకరం ఉన్న రైతుకు రూ.25 వేలు, నాలుగెకరాలు ఉన్న రైతులకు రూ.లక్ష చొప్పున సర్కారు బాకీ ఉన్నదని చెప్పారు. ఈ యేడు ధాన్యం కొనేవారు లేకపోవడంతో రైతులు అరిగోసపడ్డారని, వానకాలం మొదలైనా కళ్లాల్లో ధాన్యం పెట్టి కాంటాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొనుగోళ్ల పేరిట రూ.1500 కోట్ల దోపిడీ
కేసీఆర్ హయాంలో మహిళలు, సహకార సంఘాలకు కొనుగోలు సెంటర్ల నిర్వహణను అప్పగిస్తే కాంగ్రెస్ సర్కారు మాత్రం 50% సెంటర్లను పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టిందని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఒక్కో క్వింటాల్‌కు 10 కిలోల చొప్పున కోత పెట్టారని, ధాన్యం కొనుగోళ్లలో రూ.1,500 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాటాలు పంచుకుని మిగిలిన నగదును ఢిల్లీకి మూటలు పంపారని తూర్పారాబట్టారు. ధాన్యం టెండర్లలోనూ రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామని తెలిపారు. కానీ, సర్కారు మాత్రం కౌంటర్ దాఖలు చేయకుండా 16సార్లు వాయిదా వేయాలని కోరిందని, తప్పు చేయకుంటే తప్పించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వలేదని.. బోనస్ స్కీంను బోగస్ చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలి
18 నెలల కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో కనీస వసతుల్లేక, బాధలు చెప్పుకొనే నాథులులేక ప్రజలు అరిగోస పడుతున్నారని పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను పెండింగ్ పెట్టిన రైతుబంధు ఎప్పుడిస్తారని నిలదీయాలని, అడుగడుగునా అన్నదాతను మోసం చేస్తున్న నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
రేవంత్, ఉత్తమ్‌కు రైతుల ఉసురు: మెతుకు ఆనంద్
అన్నదాతను అరిగోసపెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టకుండానే రైతుబంధు ఇస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం మ్యానిఫెస్టోలో పెట్టి, రైతు డిక్లరేషన్‌లో చేర్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కిస్తీలు కట్టక, డీజిల్‌కు పైసల్లేక గ్రామ పంచాయతీల్లోని ట్రాక్టర్లను ఫైనాన్స్ సంస్థలకు అప్పజెప్పుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి అనేక ప్రజా సమస్యలను పక్కనబెట్టిన ప్రభుత్వం.. తమను ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెట్టి ఇబ్బందులుపెడుతున్నదని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, గాంధీనాయక్ పాల్గొన్నారు.