నారాయణపేట రూరల్, డిసెంబర్ 12 : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం 400 మందికి మధ్యాహ్న భోజనం కోసం 50 కిలోల బియ్యంతో వంట చేయించా రు. అన్నంలో పురుగులు, రాళ్లు కనిపించడంతో విద్యార్థులు పారబోశారు. విషయం తెలుసుకొన్న పీడీఎస్యూ నాయకులు బడికి చేరుకొని విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో హెచ్ఎం దత్తురావు స్పందించి వారికి నచ్చజెప్పి వేరే బియ్యం తో మళ్లీ వండించి పెట్టడంతో ఆందోళన సద్దుమణిగింది. రేవంత్రెడ్డి ప్రజాపాలనలో ప్రభుత్వ బడుల్లో వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు రావడం సిగ్గుచేటని పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్ అన్నారు.