మెదక్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ చూసినా ఇదే వైఖరి కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎకడ పర్యటించినా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తున్నది. తాజాగా మెదక్ జిల్లా పర్యటనలో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పలేదు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి వివరిస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. ‘మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిందేమిటి?’ అని నిలదీశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ఇండ్లు రాలేదని పలువురు ప్రశ్నించారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. నిరసన తెలిపిన సామాన్యులపై దాడికి తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దీంతో సభాప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుల గొడవను ఆపాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజలను చితకబాదారు. రక్షించాల్సిన పోలీసులు ప్రజలపై లాఠీలు ఝుళిపించారు. అంతకు ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా.. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఓ వ్యక్తి మంత్రిపై మొకజొన్న కంకి విసిరారు. అతన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు సభలోనే చితకబాదారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించాలని తలపెట్టిన కాంగ్రెస్ సభకు అడుగడుగునా ఆటంకాలు తప్పలేదు. అయితే కాంగ్రెస్ నాయకులు సామాన్యులపై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను మరచి అడుగడుగునా మోసం చేస్తుందని ప్రశ్నించిన ప్రజలపై దాడులకు తెగబడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా రాహుల్‌గాంధీ చెప్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ? అంటూ నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రౌడీయిజం చేస్తున్నారని, ప్రశాంతమైన మెదక్‌లో కల్లోలం సృష్టిస్తూ అశాంతిని నెలకొలుపుతున్నారని పలువురు మండిపడుతున్నారు.