హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైడ్రాతో హైదరాబాద్‌కు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల ఇండ్లు కూల్చలేదని, అది కూల్చినవన్నీ సంపన్నులవేనని తెలిపారు. ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా కూల్చిన ఇండ్లలో ఒక్కటే పేదల ఇల్లు ఉన్నదని, మిగిలినవన్నీ పెద్దలవేనని చెప్పారు.
కొందరు హైడ్రా, మూసీపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇచ్చారని, కానీ కోర్టు ఆదేశాలతో ఆగిపోయారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు నిలిచిపోలేదని, త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా నిత్యం తమను సంప్రదిస్తూనే ఉన్నారని చెప్పారు. ఇప్పటికే చేరినోళ్లకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, అందుకే వారు చేరినట్టు ప్రకటించడం లేదని అన్నారు. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్చొచ్చని, అదానీ కూడా అదేవిధంగా ఇచ్చారని చెప్పారు.
మంత్రి కొండా సురేఖ, నాగార్జున కుటుంబం వివాదంపై స్పందించిన మహేశ్‌కుమార్.. సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. మంత్రి సురేఖ వ్యక్తుల పేర్లు తీసుకొని మాట్లాడి ఉండకూడదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని, పథకాలను ఎగ్గొట్టే ఆలోచనల ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల్లోనే ఉన్నదని తెలిపారు. జీవన్‌రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.