ఖలీల్‌వాడి(నిజామాబాద్), మే 17 : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశావహులు ఎంతోమంది ఉన్నారని బెర్తులు తక్కువగా ఉన్నాయని అన్నారు. కానీ చాలామంది క్యాబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారని చెప్పారు.
పీసీసీ చీఫ్‌గా తనను కేవలం సలహాలు, సూచనలు మాత్రమే అడుగుతారని, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటారని చెప్పారు. ఆలస్యమైనందున క్యాబినెట్ విస్తరణ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఈ విషయంలో విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై తెలంగాణలోనూ మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకువస్తామని చెప్పారు. ఈ నెలాఖరులో పూర్తిస్థాయిలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేస్తామని అన్నారు. మూడేండ్లు దాటిన చోట జిల్లా అధ్యక్షులను మారుస్తామని తెలిపారు.