హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.531 కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్చేసింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి నిరసన తెలిపారు. 23 నెలలుగా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో తాము తీవ్ర ఆర్థికఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.
అప్పులు ఇచ్చినవారి వేధింపులు భరించలేక ఇప్పటికే ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని బిల్లులు విడుదల చేయాలని, లేకపోతే మిగిలిన వారంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నదని ఓ మహిళా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుంటి మధుసూదన్‌రెడ్డి, కేశబోయిన మల్లయ్య, అంజయ్యగౌడ్, అరవింద్‌రెడ్డి, రవీందర్, మోడం విద్యాసాగర్, బండమీది రాము, బోడ లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.