కొల్లాపూర్, ఫిబ్రవరి 27 : మంత్రి జూపల్లి ఇలాకాలో యూరియా కొనుగోళ్లపై వసూళ్ల దందా కొనసాగుతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ మొత్తంలో యూరియాను తెప్పిస్తే యూరియా బస్తాపై సగటున రూ.30 నుంచి 50వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు.
గురువారం కొల్లాపూర్ మండలానికి 260మెట్రిక్ టన్నుల యూరియా వస్తే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాలకు 22వేల బస్తాల యూరియా వచ్చింది. అయితే శుక్రవారం ఆన్లైన్ యాప్లో యూరియా బుక్ చేసి తీసుకునేందుకు వెళ్లిన రైతులకు ఫర్టిలైజర్ షాప్ యాజమానులు షాక్ ఇచ్చారు. బస్తాకు రూ.270 చెల్లించాల్సి ఉండగా రైతుల నుంచి బస్తాకు అదనంగా రూ. 30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బస్తాకు రూ. 270 మాత్రమే తెచ్చుకున్న రైతులు యూరియా బస్తాలను తగ్గించి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎందుకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఫర్టిలైజర్ షాప్ యాజమానులను నిలదీయడంతో ఏవో వసూలు చేసుకొమని చెప్పాడని చెప్పడం గమన్హారం. కొల్లాపూర్లో యూరియా విక్రయించే నిర్వాహకులు, అధికారులు కుమ్మకై యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలోనే యూరియా వసూళ్ల దందా నడుస్తుండటం శోఛనీయంగా ఉంది.