హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.6వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సచివాలయంలో బీసీ సంఘం నేతలతో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
సుదీర్ఘకాలంగా బకాయిలను చెల్లించకపోవడంతో బడుగు, బలహీనవర్గాలకు చెందిన 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యాజమాన్యాలు కూడా కాలేజీలను నిర్వహించలేక మూసేసే దుస్థితికి చేరుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో బీసీ నేతలు నీల వెంకటేశ్, జూలపల్లి అంజి, అనంతయ్య, రాజేందర్, మోదీ రాందేవ్, రవియాదవ్, బాలస్వామి, భాస్కర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.