కొత్తగూడెం: పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్, కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్టుల మృతి చేసులో నిజనిర్ధారణకు రఘునాథపాలం అటవీ ప్రాంతానికి వెళ్తుండగా మణుగూరులో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులు స్టేషన్ గేటుకు తాళాలు వేసి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, రఘునాథపాలెం, మోతే, తాటిగూడెం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు గాలింపు చేపట్టారని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు చెప్పారు. గ్రేహౌండ్స్ బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన గ్రేహౌండ్స్ బలగా లు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పుల విరమణ తర్వాత ఘటనా స్థలాన్ని అధీనంలోకి తీసుకున్న గ్రేహౌండ్స్ బలగాలు.. ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి.
మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉ న్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, మణుగూ రు ఏరియా కార్యదర్శి లచ్చన్న దంపతులు కూ డా మృతి చెందారు. వీరిపై రివార్డులు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకులు 2, ఎస్ఎల్ఆర్ 1, 303 రైఫిల్ 1, పిస్టల్ 1, మ్యాగజైన్‌తోపాటు లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించామని తెలిపారు. ఒక మావోయిస్టు పారిపోయినట్టు పేర్కొన్నారు.