పరిగి, డిసెంబర్ 25 : లగచర్ల ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. 37 రోజులు తనను జైలులో పెట్టి సీఎం పైశాచికానందం పొందారని మండిపడ్డారు. ఈ కేసులో కేటీఆర్‌ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రజల తరపున పోరాడుతున్న కేటీఆర్‌ను ఎలాగైనా జైలుకు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిగిలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను ఎలాంటి వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక రౌడీని, దొంగను అరెస్టు చేసినట్టు తీసుకువెళ్లి డీటీసీ సెంటర్లో పెట్టారని నిప్పులుచెరిగారు. డీటీసీ నుంచి పరిగికి తీసుకొచ్చి, అక్కడి నుంచి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ దవాఖానకు తీసుకెళ్లారని, అప్పటివరకు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని వివరించారు. అప్పటికే సురేశ్ పేరు ఏ1గా పెట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారని, తనను దవాఖానకు తీసుకువెళ్లిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారని, రిమాండ్ రిపోర్ట్ చదవనీయకుండా తన సంతకం తీసుకున్నారని చెప్పారు.
‘10 నిమిషాల్లో జడ్జి ముందుకు వెళ్లాలి, జడ్జి వెళ్లిపోతారని తొందర పెట్టి దవాఖానలో తన సంతకం తీసుకొని జడ్జి ముందు హాజరు పరిచారు. కేటీఆర్ చెప్పినందుకే తాను దాడి చేయించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నదని పత్రికల ద్వారా, మా కుటుంబసభ్యులు ములాఖత్‌కు వచ్చినప్పుడు తెలుసుకొని షాక్‌కు గురైన. ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్ చదివే అవకాశం ఇవ్వకుండా, న్యాయవాదులకు ఇవ్వకుండా పది నిమిషాల్లోనే మీ ముందు హాజరు పరిచారు అని జైలు నుంచే జడ్జికి లేఖ రాసిన’ అని వెల్లడించారు. తప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉన్నదని లేఖ రాస్తే జడ్జి ఆమోదించారని తెలిపారు. డీటీసీ సెంటర్లో ఐజీ, ఎస్పీ వచ్చారని, తనను ఎవరు ఏమీ అడగలేదని, వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎందుకు అరెస్టు చేశారని తాను ప్రశ్నిస్తే పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, అరెస్టు చేశామని చెప్పారని వివరించారు. అక్రమంగా, రాజకీయ కక్షతో ఈ కేసు తనపై పెట్టి కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి, నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరఫున పోరాటం చేయకుండా సీఎం చేసిన కుట్రలో భాగమని మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే
అసెంబ్లీలో రైతుభరోసాపై విధివిధానాలు ప్రకటిస్తానని చెప్పారని, సంక్రాంతి నుంచి రైతుభరోసా ఇస్తామని ప్రకటించి అసెంబ్లీలో రైతుబంధుపై ప్రకటన చేయకుండా కేటీఆర్‌పై ఏసీబీ కేసు, సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు పెట్టారని పట్నం విమర్శించారు. రోజుకో కేసు పెట్టి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్‌రెడ్డి కుయుక్తులు పన్నుతున్నాడని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కనబెట్టి అల్లు అర్జున్ అంశంపై గంటన్నరపాటు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.
ఇంత దిగజారుడు సీఎం ఇంకొకరు ఉండరు
రేవంత్‌రెడ్డి సీఎం అయితే తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డ కొడంగల్ రైతులను అరెస్టు చేయించి బేడీలు వేయించారని పట్నం విమర్శించారు. జైలులో రైతుకు గుండెపోటు వచ్చినా అతడికి బేడీలు వేయించిన ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేస్తే ఇంకా భయపడి చనిపోతే ఎవరు బాద్యులని ప్రశ్నించారు. లగచర్ల దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం, పోలీసుల నిఘా వైఫల్యమేనని విమర్శించారు. ఘటనకు 15 రోజుల క్రితం అక్కడ ఒక దాడి జరిగిందని, సీఎం ప్రధాన అనుచరుడు శేఖర్‌ను రైతులు తీవ్రంగా కొట్టారని, అంత పెద్ద దాడి తర్వాత రెండోసారి పోలీసులు లేకుండా కలెక్టర్‌ను ఆ గ్రామానికి ఎలా పంపిస్తారని నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు.