కోస్గి, జూన్ 15 : 2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి సీఎం పీఠంపై కూర్చున్న రేవంత్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటమి రుచిచూపించడం ఖాయమని చెప్పారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి ప్రెస్‌క్లబ్‌ను ఆయన సందర్శించి మీడియా ప్రతినిధుల సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. రేవంత్‌రెడ్డివి మోసపూరిత హామీలని తెలియక ఇక్కడి రైతులు, ప్రజలు అమాయకంగా నమ్మి ఓటేస్తే వారిని వంచించారని విమర్శించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎందుకు మొదలు పెట్టారో రేవంత్‌కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
జూరాల కింద పంటలకు నీరివ్వడం చేతగాని కాంగ్రెస్ క్రాప్ హాలిడే ప్రకటించి మళ్లీ నారాయణపేట కొడంగల్ పేరుతో నీరెలా ఇస్తారో ప్రజలు, రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిందని, మిగిలిన పదిశాతం పూర్తిచేస్తే కొడంగల్ రైతులకు సాగు నీరు అందేదని చెప్పారు. పాలమూరు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తదనే ఉద్దేశంతో పక్కనపెట్టారని ఆరోపించారు.
సొంత నియోజకవర్గంలోని రైతులకు రైతుభరోసా ఇవ్వలేని రేవంత్ 2034 వరకు సీఎంగా ఎలా ఉంటారో చెప్పాలని నిలదీశారు. కొడంగల్‌లో కమీషన్ల కోసం కొత్త రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కోస్గి పట్టణంలో రహదారులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వెంట కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్‌నర్సింహులు, మండల నాయకులు ఉన్నారు.