పెంచికల్పేట్, డిసెంబర్ 27 : కేంద్రం రాజకీయ లబ్ధికోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చూస్తున్నదని, మాలలంతా ఒక్కటై వర్గీకరణను అడ్డుకుందామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్లో అంబేదర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెంచికల్పేట్, కొండపల్లిలో ఏర్పాటు చేసిన అంబేదర్ జెండా మహోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోతామని చెప్పారు. అంబేదర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ మాట్లాడుతూ అంబేదర్ ఆశయాలతో భావితరాలకు బాటలు వేసుకోవడమే లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.