కాంగ్రెస్‌లో ఏదో జరుగుతున్నది. వరుసగా రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నేతల ఢిల్లీ వెళ్తుండటం, ఒక్కొక్కరితో అధిష్ఠానం పెద్దలు మాట్లాడుతుండటం సైలెంట్‌గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యనేత పావులు కదుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. విక్రమార్కను కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు దాటినా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటుకాలేదు. ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూన్‌లోనే ఆ రెండు బెర్తులతోపాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భట్టివిక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. గతంలో సచివాలయంలోని భట్టి చాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్‌మైన్ గొడవల నేపథ్యంలో అధిష్ఠానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ వెళ్లిన భట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్ఠానాన్ని విన్నవించినట్టు తెలిసింది.
ప్రక్షాళన మీదనే ఫోకస్
మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు పారీ వర్గాలు చెప్తున్నాయి. రానున్న పదిహేను రోజుల్లో విస్తరణ జరిగే అవకాశం ఉన్నదనే ప్రచారం సాగుతున్నది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడం కంటే, మంత్రివర్గ ప్రక్షాళన మీదనే అధిష్ఠానం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నదని గాంధీభవన్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఢిల్లీ దూత ఇచ్చిన నివేదికలే కాకుండా, మరో రెండు ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో అంతర్గత సర్వే చేయించినట్టు సమాచారం. ప్రధానంగా మంత్రుల అవినీతి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల అభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిసింది. మరోవైపు రాష్ర్టానికి చెందిన సీనియర్ నేతలను స్వయంగా రాహుల్‌గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలిసింది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి రాష్ట్ర పాలనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని చెప్తున్నారు. వీటన్నింటి ఫలితాలను మదింపు చేసుకొనే మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ చేపడుతారని భావిస్తున్నారు.
రెవెన్యూ శాఖపైనా చర్చ
జరుగబోయే ప్రక్షాళనలో భట్టి విక్రమార్కకు పదవీ గండం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యనేత నడిపిన మంత్రాంగంతోనే భట్టి రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను క్యాబినెట్లోకి తీసుకొని, స్పీకర్ స్థానాన్ని భట్టితో నింపాలని ముఖ్యనేత ప్రతిపాదనలు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం భట్టి సేవలను పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. భట్టి వద్ద ఉన్న ఆర్థిక శాఖను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కేటాయించే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఉన్న రెవెన్యూ శాఖను ఆయన నుంచి తప్పించి, మరొకరికి కేటాయించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. పొంగులేటి, భట్టి నిర్వహిస్తున్న శాఖలపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖల మార్పులు చేసే అవకాశం ఉన్నదనే చర్చ నడుస్తున్నది. మరోవైపు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనా వేటు వేయించేందుకు ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారని తెలిసింది. ఆయనకు నోరు అదుపులో ఉండదనే కారణాలు చూపిస్తూ ఆయనపై వేటుకు సిఫార్సు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెకు కూడా ఆయన్నే కారణంగా చూపెడుతున్నట్టు తెలిసింది. వీరితోపాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.