Part Time Lecturers | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరబోయిన పార్ట్ టైం అధ్యాపకులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దశాబ్దాలుగా యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నియామకాలలో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్ట్ టైం అధ్యాపకుల అనుభవానికి వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు.