తొర్రూరు, జనవరి 29 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు స్కూల్‌ను ముట్టడించారు. ఈ విషయంపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించగా వారు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులను నిలదీశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు టీచర్లను చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులు, గ్రామస్థులకు సర్దిచెప్పారు. ముగ్గురు టీచర్లను తొర్రూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణాధికారిగా మరిపెడ ఎంఈవో అనితాదేవి పాఠశాలను సందర్శించి బాలికల నుంచి వివరాలు సేకరించారు. నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయనున్నట్టు తెలిపారు.