సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 10: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 324 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 122 మంది, ఉన్నత పాఠశాలలో 202 మంది ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్నారు. కేవలం ఐదుగురు ఉపాధ్యాయులతోనే పదోతరగతి వరకు విద్యార్థులకు బోధన చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. డీఈవో రమేశ్‌కుమార్ హామీతో ఆందోళన విరమించారు.