తిరుమలగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): చైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫీషియో మెంబర్‌గా ఓటేసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఐదు గంటలపాటు నిరీక్షణ చేయించి నరకం చూపించిన వైనం శనివారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. తిరుమలగిరిలోని 15 వార్డుల్లో 10 బీఆర్ఎస్కు, 5 కాంగ్రెస్‌కు రావడంతో బీఆర్ఎస్కు ఛైర్మన్ స్థానం ఖాయమైంది. కాంగ్రెస్ ఎలాంటి అడ్డదారి తొక్కుతుందోననే అనుమానంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి దరఖాస్తు చేసేందుకు మున్సిపల్‌కు చేరుకున్నారు. వాస్తవానికి ఐదు నిముషాల్లో తతంగం పూర్తి కావాల్సి ఉండగా ఒక ఎమ్మెల్సీ అనే కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ ఫోన్ మాట్లాడటం, ఇతరులతో మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల వరకు అంటే దాదాపు ఐదు గంటలపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమయం అయిపోయేటప్పడు మీకు అవకాశం లేదని కమిషనర్ సెలవిచ్చారు. దీంతో ఎమ్మెల్సీతోపాటు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 13న ఒక సర్క్యులర్ వచ్చిందని దాని ప్రకారం ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎమ్మెల్సీ అవుతారో అదే నియోజకవర్గంలో ఎక్స్అఫీషియోగా దరఖాస్తుకు అవకాశం ఉందని కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్క్యులర్ చదివి చెప్పేందుకు ఐదు నిముషాల సమయం పడుతుంది.. ఐదు గంటల పాటు ఎందుకు కూర్చోబెట్టి ఇంబ్బందులకు గురి చేశారన్నారు. కమిషనర్ తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అధికార పార్టీ వత్తిడితోనే ఇలా నిరీక్షణ చేయించారని, ఓటు వేయడానికి అవకాశం లేకుంటే వెంటనే పంపించాలి తప్ప ఐదు గంటల పాటు కుర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.