ఆదిలాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు ఈ నెల 20 నుంచి పత్తిని విక్రయించడానికి మార్కెట్ యార్డులకు రావద్దని సూచించారు. వానకాలంలో రైతులు 4.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అంచనా వేసిన అధికారులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది క్వింటాకు రూ.8110 మద్దతు ధర ఉండగా జిల్లాలో 11 మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ప్రారంభించి అక్టోబరు 27 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనల ఫలితంగా చాలా మంది రైతులకు మద్దతు ధర దక్కలేదు. సీజన్ ప్రారంభం నుంచి సీసీఐ పూటకో నిబంధన అమలు చేస్తూ రైతులను నష్టాలకు గురి చేసింది. పత్తిని భారీగా రైతులు విక్రయానికి తీసుకురాగా పంటలో తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తెలిపారు. చలి వాతావరణం కారణంగా నిర్ధేశిత తేమ శాతం రాదేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1400 తక్కువకు విక్రయించి నష్టపోయారు.
కొనుగోళ్ల ప్రారంభంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించడంతో రైతులు మిగిలిన పత్తిని ప్రైవేటులో విక్రయించి నష్టపోయారు. కొనుగోళ్లు ప్రారంభించిన నెల రోజుల తర్వాత పత్తిలో దూది పింజ రావడం లేదంటూ మద్దతు ధరలో రూ.50 తక్కువ చేసి కొనుగోలు చేశారు. మరో పక్షం రోజుల తర్వాత ఇదే కారణం చూపించి రూ.100 తగ్గించిన సీసీఐ అధికారులు పంటను సేకరించారు. దీంతో రైతులకు మద్దతు ధర లభించక నష్టపోయారు.
రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన పంటలో తేమ శా తం 8 ఉంటే మద్దతు ధర క్వింటాలుకు రూ.8010 చెల్లిస్తా రు. తేమ శాతం 7 ఉంటే మద్దతు ధరలో ఇన్సెంటివ్ రూ. 80 కలిపి రూ.8090 చెల్లిస్తారు. 6శాతం ఉంటే రూ.160 క లిపి రూ.8170 చెల్లించాల్సి ఉండగా..50 మంది రైతులకు కూ డా ఇన్సెంటివ్ చెల్లించలేదు. ఇన్సెంటివ్ గురించి రైతులు అడిగితే తమకు ఆదేశాలు లేవని సీసీఐ సిబ్బంది తెలిపారు. రై తుల వద్ద నుంచి పత్తి కొనుగోళ్లలో పలు షరతులు విధించిన సీసీఐ అధికారులు నిబంధనల ప్రకారం వారికి ఇచ్చే ఇన్సెంటివ్ను మాత్రం ఎగ్గొట్టారని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
గతేడాది మార్చి చివరి వారం వరకు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగగా.. ఈ ఏడాది నెల రోజులు ముందుగానే మూసి వేస్తున్నారు. దీంతో రైతులు పంటను మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటులో మద్దతు ధర క్వింటాలుకు రూ.7730 ఉంది. దీంతో క్వింటాలుకు రూ.300 వరకు నష్టపోవాల్సి వస్తున్నది. పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సిన సీసీఐ అర్ధాంతరంగా కేంద్రాలను మూసి వేస్తుండడంతో రైతులు నష్టపోనున్నారు.