యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పట్టు వీడలేదు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వెనెక్కి తిరిగి చూడలేదు. మున్సిపల్ పోరులో అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. తాయిలాలు, మద్యం పంపిణీ చేసినా జనం ఉద్యమ పార్టీకి అండగా నిలిచారు. ఎక్కడా గులాబీ జెండాకు ఆదరణ తగ్గలేదు. అనేక స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఓట్ల విషయంలోనూ తగ్గేదేలే అని నిరూపించుకుంది. కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేయగా, బీఆర్ఎస్ మాత్రం 90 స్థానాల్లోనే తమ అభ్యర్థులను బరిలో నిలిపిన విషయం తెలిసిందే.
భూదాన్‌పోచంపల్లిలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాలేదు. 13 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ, ఇండిపెండెంట్ చెరో సీటును గెలుచుకున్నారు. ఇక్కడ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఓట్లలోనూ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 45.64 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష బీఆర్ఎస్కు 42.09 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు పార్టీల మధ్య 3.55 శాతం ఓట్లు తేడానే ఉంది.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్ ఓట్లను రాబట్టింది. హస్తం పార్టీకి 39.74 శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్కు 35.05 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 4.69 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇక్కడ సైతం ఇద్దరు గులాబీ పార్టీ అభ్యర్థులు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.
ఆలేరులో గులాబీ పార్టీకి 34.05 శాతం ఓట్లు, మోత్కూరులో 33.21 శాతం ఓట్లు పోలయ్యాయి. భువనగిరిలో దాదాపు అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ బలమైన పోటీ ఇచ్చింది. ఇక్కడ ఆ పార్టీకి మిశ్రమ ఓట్లు వచ్చాయి.
ఆరు మున్సిపాలిటీలు కలిపి బీజేపీ 13.81 శాతం ఓట్లను రాబట్టుకుంది. మొత్తం పోయినసారి ఆ పార్టీకి 12 స్థానాలు రాగా ఈ సారి సైతం అదే సంఖ్య పునరావృతమైంది. భువనగిరిలో ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు. గతంలో 7 చోట్ల గెలవగా ఈసారి నాలుగు స్థానాలకే పరిమితమైంది. గతంలో సీపీఎంకు 3 స్థానాలు ఉండగా ఈసారి ఒక స్థానానికి పడిపోయింది. సీపీఐ విషయానికొస్తే ఈసారి ఒక సీటు మెరుగు పడి మొత్తంగా రెండు గెలుచుకుంది.
గుట్టలో కారు గుర్తుకు జై కొట్టిన ఓట్లరు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 14: గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దిన తొలి సీఎం కేసీఆర్‌పై యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ప్రజలు ఓటుతో మద్దతు పలికారు. అధికార కాంగ్రెస్ బెదిరింపులు, మద్యం పంపకం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మా త్రం కారు గుర్తుపై తమకున్న ఆదరణను పదిలంగానే దాచుకున్నట్లుగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన బీఆర్ఎస్కు ఓటర్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఒక్క ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పంచినా కేసీఆర్‌కే మా ఓటు అని బ్యాలెట్ ద్వారా నిరూపించారు. ఎన్నికల్లో 35.05 శాతం ఓటర్లు కారు గుర్తుకే ఓటేశారు. గుట్ట పరిధిలో 12 వార్డులకు 10వ వార్డు కాంగ్రెస్ ఏకగ్రీవం కైవసం చేసుకుంది. మిగతా 11 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 6వ వార్డు మినహా మిగతా 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు.
మొత్తం 11,441 ఓట్లు పోలవ్వగా ఇందులో బీఆర్ఎస్కు 4,011 ఓట్లు రాగా 35.05 శాతం, కాంగ్రెస్‌కు 4,547 ఓట్లు రాగా 39.74 శాతం, బీజేపీకి 1,436 ఓట్లు రాగా 12.55 శాతం, ఇతర పార్టీలకు 1,447 ఓట్లు రాగా 12.64 శాతం ఓట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. వార్డుల వారీగా గమనిస్తే బీఆర్ఎస్ ఓట్ల శాతం పదిలంగానే ఉంది. 1వ వార్డులో 786 ఓట్లకు కేవలం 8 ఓట్లు మాత్రమే రాగా మిగతా వార్డుల్లో తమదైన శైలీలో బీఆర్ఎస్కు ఓట్లరు జై కొట్టారు. 2వ వార్డులో 1,152 ఓట్లు పోలవ్వగా 472 (40.97శాతం) మంది ఓటర్లు కారు గుర్తుకే ఓటేశారు. 3వ వార్డులో 1,050 ఓట్లకు 431 (41.04 శాతం) మంది, 4వ వార్డులో 975 ఓట్లకు 394 (40.41 శాతం) మంది, 5వ వార్డులో 1,079 ఓట్లకు 331 (30.67 శాతం) మంది, 7వ వార్డులో 1,131 ఓట్లకు 560(49.51 శాతం) మంది, 8వ వార్డులో 1,106 ఓట్లకు 719 (65 శాతం) మంది, 9వ వార్డులో 1,082 ఓట్లకు 522 (48.24 శాతం) మంది, 11వ వార్డులో 965 ఓట్లకు 170 (17.61 శాతం) మంది, 12వ వార్డులో 1,040 ఓట్లకు 404 (38.84 శాతం) మంది ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు.
భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
కేసీఆర్‌పై అభిమానంతో 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పేరబోయిన సత్యనారాయణ 360 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఇంతస్థాయిలో మెజార్టీ వచ్చిన ఏకైక నాయకుడిగా చరిత్రలో నిలిచారు. 1,106 ఓట్లకు బీఆర్ఎస్ అభ్యర్థి పేరబోయిన సత్యనారాయణకు 719 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 359 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 12 ఓట్లు, ఇండిపెండెంట్‌కు 4 ఓట్లు వచ్చాయి. 7వ వార్డులో జయమ్మ గెలుపొందారని భావించినా, చివరికి స్వల్వ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. 4 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 9వ వార్డులో దండెబోయిన మమత 16 ఓట్లతోనే ఓటమి పాలయ్యారు.