BJP |స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): నిన్న ఉద్యోగాల భర్తీపై కుట్ర, నేడు విద్యార్థుల పరీక్షలపై కుతంత్రం. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైతే, విద్యార్థుల పరీక్షలు ఆగిపోతే తలెత్తబోయే పరిణామాలకు యువత భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారా? స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థి, యువత భవిష్యత్తును బలిపెడతారా? వారి జీవితాలతో ఆడుకుంటారా? ఇదేనా బీజేపీ నైజమని యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. వారి చర్యలను ఈసడించుకుంటున్నది. వీటన్నింటికీ కారణమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడుతున్నది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఉందా? అని ఓ విద్యావేత్త ప్రశ్నిస్తున్నారు. మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలు ఆపేందుకు జరిగిన కుట్రలోనూ బీజేపీ నేతల పాత్ర వెలుగు చూసింది. నేడు ఎస్సెస్సీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ చేయడానికి జరిగిన కుట్రలోనూ వారి పాత్రే బట్టబయలైంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడటం, వాటిలో బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ పాత్ర ఉన్నట్టు బయటపడంతో రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారిగా, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల తల్లిదండ్రులను నివ్వెరపరిచింది. ఏ తప్పూ లేకుంటే అరెస్టు ఎందుకు? రిమాండ్ ఎందుకు? అసల బండి సెల్ ఫోన్ దాయడం ఎందుకు? అని సంజయ్‌ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5 లక్షల మంది విద్యార్థులు ఎస్సెఎస్సీ పరీక్షలు రాస్తున్నారు. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకొనేందుకు ఎస్సెఎస్సీ పబ్లిక్ పరీక్షలు ఎంతో కీలకం. ఇది చదువుకు మినిమం సర్టిఫికెట్. పై చదువులు కొనసాగించే ఉద్దేశం లేనివారు మాత్రం టెన్త్ సర్టిఫికెట్ ఉంటే చాలనుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో మునుపెన్నడూ ఎస్సెఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు లీక్ అయిన ఉదంతాలు లేవు. అవీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? వీటికి కారకులు ఎవరు? మా పిల్లల భవిష్యత్తుతో బీజేపీ నేతలు ఆటలాడుకుంటారా? అని విద్యార్థుల, నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఎస్సెఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నదని, కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. అందుకే రాజకీయ పార్టీలు ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ పరీక్షలు సాఫీగా కొనసాగడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఎస్సెఎస్సీ పరీక్షలు విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం జరగడం ఎంతో అవసరం. ఈ పరీక్షలు పూర్తి అయితే తప్ప పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ కాలేజీ ప్రవేశ పరీక్షలు రాయడం సాధ్యం కాదు.
స్వార్థ రాజకీయాల కోసం 10 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో విపక్ష పార్టీలు ఆటలాడుకోవడంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు పాలకపక్షం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. కానీ, ప్రస్తుతం తెలంగాణలో విపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం, పన్నుతున్న కుట్రల పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యమ నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటి రెండింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చింది. ఇక మిగిలిన నియామకాల ప్రక్రియను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఏడాది కిందటనే పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసుకొని నోటిఫికేషన్లు విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనుండటంతో ఆలోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తి కాకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రకు బీజేపీ తెరతీసింది. ఈ లీక్ వెనుకున్న నిందితులకు బీజేపీతో ఉన్న సంబంధాలు బయటపడటంతో, తాజాగా ఎస్సెఎస్సీ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయంటూ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర నగ్నంగా బయటపడిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యమైతే మరో ఏడాది దాకా ఆగాల్సిన ప్రమాదం పొంచి ఉన్నది. డిసెంబర్ నాటికి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. దానికి రెండు నెలల ముందు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది. అంతకుముందే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు పరీక్షల నిర్వహణ, ఫలితాలు, నియామకాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. ఈ ప్రక్రియకు అడుగడుగునా విపక్షాలు అడ్డుపడటం వల్ల జాప్యం జరిగే ప్రమాదం పొంచి ఉన్నది. పైగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తి కాగానే తిరిగి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి కావాల్సిన లోక్‌సభ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఈ కారణాల దృష్ట్యా ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అడ్డుతగలడం అనేది 10 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉందన్నది విపక్షాలు గుర్తు పెట్టుకోవాలని పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రశ్న పత్రాలు లీక్ అంటూ జరుగుతున్న ప్రచారంతో తమ పిల్లలు ఆందోళనలో చదువుపై శ్రద్ధ తగ్గించే ప్రమాదం ఉన్నదని, తద్వారా మార్కులు తగ్గే అవకాశం ఉన్నదని ప్రస్తుతం ఎస్సెఎస్సీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు వాయిదా పడినా, మార్కులు తక్కువగా వచ్చినా ఎవరు బాధ్యత వహిస్తారని ప్రతిపక్షాలను నిలదీస్తున్నారు.
మా కొడుకు రుత్విక్‌రెడ్డి ములుగు స్కూల్లో చదివిండు. పేపర్ లీక్ అయిందని తెలిసి చాన బాధపడ్డం. ఈ బండి సంజయ్, అయన ఎంబడి ఉండే ప్రశాంత్ అనేటోడు ఇట్ల పేపర్ లీక్ చేస్తే వాళ్లకు అచ్చేదేముంది? పిల్లల ఫ్యూచర్ దెబ్బతింటది. ఇది వాళ్లకు మంచి అయితదా. ఏం రాజకీయాలో ఏమో. పదో తరగతి అనేది ప్రతి విద్యార్థికి కీలకమైన మెట్టు. మా వాడు పరీక్ష రాస్తుంటే సెంటర్ కాడికి వచ్చినం. ఇట్ల పేపర్ లీక్ చేస్తే పిల్లలు ఎంత బాధపడాలె. వాళ్లని చూసి మేమెంత కుమిలిపోవాలె? పేపర్ లీక్ చేయడం సిగ్గుచేటు. ఏం మనుషులు వీళ్లు. రాజకీయంగా కొట్లాడాలే కాని పిల్లల పరీక్ష విషయంలో ఇబ్బందులు పెట్టుడేంది! ఇది మంచి పద్ధతి కాదు.. ముమ్మాటికీ తప్పు. స్వార్థ రాజకీయాల కోసం పిల్లలను అవస్థలకు గురి చేసి వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఏమిటి?
– కోమండ్ల రాజిరెడ్డి-జ్యోతి, ఇంచెంచెర్వుపల్లి, వెంకటాపూర్ (ములుగు)
పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు. ఔట్ కూడా కాలేదు. విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం ఇవ్వడానికంటే ముందు బయటకు వస్తే దానిని లీక్ కావడం అంటారు. రాష్ట్రంలో ఇలాంటివి ఎకడా జరుగలేదు. పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రశ్నపత్రం బయటకు వస్తే దానిని ఔట్ కావడం అంటారు. రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన ఘటనల్లో కేవలం ప్రశ్నపత్రం సానింగ్ కాపీలే బయటకు వచ్చాయి. ప్రశ్నాపత్రాలు ఔట్ కావడం వల్ల విద్యార్థులకు ఎలాంటి లాభం ఉండదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు సీసీఈ మెథడ్‌లో జరుగుతున్నాయి. ప్రశ్నపత్రంలో వచ్చే ఏ ప్రశ్నకు జవాబులు గైడ్లోగానీ, పుస్తకాల్లోగానీ ఉండవు. విద్యార్థి పూర్తిగా తన సొంత అభిప్రాయాలు, ఆలోచనలను మాత్రమే అప్పటికప్పుడు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోనే ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ అర్థరహితమైనది. తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సాన్చేసి లీక్ అయిందని ప్రచారం చేయడం కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రగానే చూడాలి. ప్రశ్నా పత్రాల లీకేజీ, ఔట్ ప్రచారం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. బాధ్యతాయుత ప్రతిపక్ష హోదాలో ఉండి తమకు సోషల్ మీడియాలో వచ్చిన పేపర్‌ను మీడియాకు లీక్ చేయడం, ఇతర గ్రూపులకు పంపి నిందలు వేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఉపాధ్యాయులపై చర్యలు సమంజసమేనా? అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. నేరుగా ప్రశ్నాపత్రాన్ని తమ సెల్ఫోన్లో సాన్ చేసి పంపిన ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరించాల్సిందే. కానీ, ఎలాంటి సంబంధాలు లేని వారిని శిక్షించకూడదు.
– డాక్టర్ ఏ నరసింహస్వామి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (టీటీయూ,కరీంనగర్)
మహిళలపై లైంగిక దాడికి పాల్పడితే శిక్షించేందుకు పోక్సో చట్టం తీసుకువచ్చినట్లే పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలి. సోషల్ మీడియా, టీవీ చానళ్లలో పేపర్ లీకైనట్టు వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పదో తరగతిలో 11 పేపర్లను ఆరుకు కుదించడం మంచి పరిణామం. ప్రశ్నపత్రాల లీకేజీలపైనా కఠినంగా వ్యవహరించాలి. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేపర్‌ను లీకు చేసిన వారు ప్రజల మధ్య ఉండేందుకు అనర్హులు.
– కాసం రాజు, శివనగర్ (వరంగల్)
మా పాప వందిత.. ఇప్పు డు పదో తరగతి పరీక్షలు రాస్తున్నది. మొన్న జరిగిన పేపర్ లీకేజీలతో సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. తనని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితికి వచ్చింది. మానసికంగా చాలా కుంగిపోతున్నది. లీకేజీ డ్రామాలు ఆడుతున్న దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చిన్నారులకు మనోధైర్యం కల్పించాలి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, భరోసా కల్పించాలి.
– వెంగిలి సుజాత, ధర్మారం, కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారందరినీ కఠినంగా శిక్షించాలి. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేశారు. రాజకీయ, వ్యక్తిగతస్వార్థంతో లీకేజీలకు పాల్పడటం దారుణమైన విషయం. నా కొడుకు శశాంక్‌ను మొదటి రోజు సంతోషంగా సెంటర్ వద్ద దింపి వచ్చా. కొద్ది సేపటికే వికారాబాద్ తాండూర్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందన్న వార్త విని ఆందోళన చెందా. తర్వాతరోజు హిందీ పరీక్ష కూడా ప్రారంభమైన పది నిమిషాల్లోనే వరంగల్‌లో లీకైందన్న వార్త.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దిగజారుడు రాజకీయాలకు తాకట్టుపెట్టడం సరికాదు. రాత్రింబవళ్లు కష్టపడి చదివినా లాభం లేదని నా కొడుకు బాధపడితే చూడలేకపోయాం. పరీక్షలు వాయిదా పడుతాయా..? మళ్లీ రాయాల్సి వస్తుందా? తర్వాత పరీక్షలకు నా కొడుకు సీరియస్‌గా చదువుతాడా? అని ఎంతో భయపడ్డా. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు.
-బత్తిని సంపత్, ధర్మపురి
మా కొడుకు పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. పేపర్ లీక్ అయిందని తెలియడంతో ఆందోళన చెందా. తిరిగి ఎప్పుడు పరీక్షలు పెడతారో? ఏమో? అనే అయోమయ పరిస్థితిలో పడిపోయా. అసలు పరీక్షలు సజావుగా సాగుతాయా? అనేది ప్రశ్నగా మారిన సమయంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఊపిరి పీల్చుకున్నాం. అప్పటికప్పుడు సర్కారు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపడంతో ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఏర్పడింది. పేపర్ లీకేజీకి కారణమైనవారు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదు.
– సింగం రాజేశ్వరరావు, ముత్యాలంపాడు, టేకులపల్లి మండలం, భద్రాద్రి జిల్లా
నేను వండ్రంగి పని చేస్త.. నా పెద్ద కూతురు మంజుల పెద్దపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్నది. టీచర్లు కూడా మంచి శ్రద్ధ తీసుకున్నరు. రోజుకు 12 గంటలు కష్టపడి చదివేది. ఈ నెల 3 నుంచి పదో తరగతి పరీక్షలు చాలైనయ్. మొదటి రోజే తెలుగు పేపర్ బయటకు వచ్చిందని వార్త వచ్చింది. రెండోరోజు కూడా హిందీ పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చినయ్. ఇన్ని రోజులు మా బిడ్డ కష్టపడి చదివింది వృథా అయితదా? మళ్లీ ఎట్ల చదివించాలె? అని ఆందోళన పడ్డ. నాన్న పేపర్ లీక్ అయిందటా? అని మా బిడ్డగూడ బాధవడ్డది. కానీ, సర్కారు సరైన నిర్ణయం తీసుకొన్నది. లీకేజీ వెనుక ఉన్నోళ్లను అరెస్ట్ చేసింది. పరీక్షలను ఆపకుండా నిర్వహిస్తున్నది. పేపర్ లీక్ చేసి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. దోషులను కఠినంగా శిక్షించాలె.
– నూతి తిరుపతి, పదో తరగతి విద్యార్థిని తండ్రి, కమ్మరివాడ, పెద్దపల్లి
విద్యార్థులకు పదో తరగతి చాలా కీలకం. ప్రశ్నపత్రాలను కొందరు వరుసగా లీక్ చేస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు. రెండో లీకేజీ వార్త వినగానే ఆందోళన కలిగింది. కష్టపడి చదువుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు. పరీక్షలు రద్దవుతాయనే భయం కలిగింది. టెన్షన్ పడొద్దని మా పిల్లలకు చెప్పినం. రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదు. గతంలో ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చూడలేదు. పేపర్ లీకేజీలు చేసేందుకు నాయకులు దిగజారుతుండటం సిగ్గుచేటు. దోషులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలి. లీకేజీ కుట్ర వెనుక బీజేపీ నేత బండి సంజయ్ హస్తం ఉండటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. హిందీ పేపర్ లీకైన గంటల్లోనే ప్రభుత్వ యంత్రాంగం దోషులను పట్టుకునేందుకు తీసుకున్న చొరవ అభినందనీయం. తర్వాత పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసి ప్రభుత్వం విద్యార్థుల్లో మనోధైర్యం నింపింది.
– మారగోని వెంకటయ్య, రాజపేట తండా, మర్రిగూడ మండలం, నల్లగొండ.
నేను మొదటిరోజు పరీక్షా కేంద్రానికి భయం భయంగానే పోయిన. పరీక్ష రాసి బయటకు వచ్చాక పేపర్ లీక్ అయిందని టీవీల్లో వార్తలు వచ్చినయ్. చాలా భయపడ్డా. పరీక్షలు క్యాన్సిల్ అయితే మళ్లీ రాయాలా? అని కంగారుపడ్డా. కానీ సర్కారు పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తుండటంతో ఊపిరి పీల్చుకున్నా.
– సుందరయ్య, విద్యార్థి, ఖమ్మం