ఝరాసంగం, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ 100 మంది యువకులతో పాదయాత్ర ప్రారంభించాడు. కేసీఆర్ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సోమవారం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం, మహా మంగళ హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అక్కడి నుంచే పాదయాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు. నాలుగు రోజులపాటు 140 కిలోమీటర్ల సాగే ఈ పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని ఫౌమ్ హౌస్‌కు చేరనున్నది. ఈ సందర్భంగా పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.
ఆయన పాలన చాలా బాగుంటుందని, పదేండ్లలో తెలంగాణ రా్రష్ట్రం విలువను పదిరెట్లు పెంచినట్టు కొనియాడారు. బీఆర్ఎస్ లేని లోటు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాదయాత్రకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.