హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్(Bjp and Congress) పాలిత రాష్ట్రాల్లో కోకొల్లలుగా పేపర్ లీకేజీలు అవుతున్నా అక్కడి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు(Opposition Leaders) నిరుద్యోగుల్లో భయందోళనలు కలిగిస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఆరోపించారు.
2017లో యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ జాయ్సీ జాయ్ అనే మహిళను హైదరాబాద్లో అరెస్టు చేశారని, ఆసమయంలో నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు.గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకులు, ఉద్యోగాలు అమ్ముకోవడం సర్వసాధారణమైందని విమర్శించారు. స్కాంలకు పెట్టింది పేరే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. రోశయ్య హయాంలో ఏపీపీఎస్సీ సభ్యున్ని అరెస్ట్ చేస్తే నాటి మంత్రులు రాజీనామా చేసిందా అని ప్రశ్నించారు.
టీఎస్ పబ్లిక్ సర్విస్ కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ అని ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 37వేల ఉద్యోగాల నియమకాలు చేపడితే ఎక్కడా చిన్న ఆరోపణలు రాలేదని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తుల తప్పుకు కేటీఆర్ పేషీకి ఏం సంబంధమని అన్నారు. ప్రతిపక్షాలకు సోయి లేక ముందే ఈనెల 12న విషయం తెలియగానే సిట్ ఏర్పాటు చేసి నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు .
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాలతో తెలంగాణ యువతకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే మంత్రి కేటీఆర్ యువతకు నిన్న భరోసా కల్పించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి చేస్తున్న అసంబద్ద ఆరోపణలను ఎవరూ నమొద్దని కోరారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.