తొర్రూరు, జనవరి 14: బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశానికి సందేశంగా ఇద్దామని, దేశంలో ఎవరూ అమలు చేయలేని, సాహసించలేని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దేశంలో రైతు సరారు స్థాపన లక్ష్యంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా విస్తరించినట్టు తెలిపారు. ఖమ్మం సభకు పాలకుర్తి నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఖమ్మం చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలోని 10, 12 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు తెలిపారు. సభకు వచ్చే ప్రజలతోనే నాయకులు కలిసి రావాలని, వారి మధ్యలోనే ఉండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకునేలా సహకారం అందించాలని సూచించారు. నాడు తెలంగాణ సాధన కోసం కరీంనగర్లో నిర్వహించిన తొలి సభ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాందిగా నిలిచి ఎలా చరిత్రలోకి ఎక్కిందో.. అలాగే ఖమ్మం సభ కూడా భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోనున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని సభాస్థలాన్ని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం వేకువజామునే పరిశీలించారు. సభా స్థలంలో ఎటువైపు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. వారి వెంట ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.