హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayathi Elections) కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఉప సర్పంచ్‌ను కూడా ఈ సాయంత్రమే ఎన్నుకోనున్నారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మొత్తం 38,350 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, 71,071 మంది పోటీలో ఉన్నారు. కాగా, 31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు ఉండగా, మరో 153 మంది ఇతరులు ఉన్నారు.

చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు తన స్వగ్రామం ఝరసంఘంలో క్యూలో నిల్చుని.. తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌లో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దుగ్గొండి మండలంలోని తన స్వగ్రామం కేశవాపూర్‌లో ఓటు వేశారు. కాగా, వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి 8వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి గుర్తు లేకపోవడంతో పోలింగ్ ఆగిపోయింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్‌పూర్ కడ్కిలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని 103 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21.93 శాతం, మెదక్‌లో 21.83 శాతం, నల్లగొండలో 28.15 శాతం, సూర్యాపేటలో 25.97 శాతం, యాదాద్రిలో 20.82 శాతం, నిజామాబాద్‌లో 20.49 శాతం, కామారెడ్డిలో 20.96 శాతం, వరంగల్‌లో 18.82 శాతం, హనుమకొండలో 19.57 శాతం, ములుగులో 18.85 శాతం, భూపాలపల్లిలో 26.40 శాతం, జనగామలో 16.82 శాతం, మహబూబాబాద్‌లో 23.30 శాతం చొప్పున ఓట్లు నమోదయ్యాయి.













