Telangana | మద్దూరు(ధూళిమిట్ట)/గణపురం/దామెర/కరకగూడెం, జూన్ 11 : ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం. పారిశుద్ధ్య ట్రాక్టర్ల డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులకు ఎవరూ అప్పులు ఇవ్వడం లేదు’ అంటూ పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. బుధవారం సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, భద్రాద్రి జిల్లాల్లోని పలువురు పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళంచెవులను అధికారులకు అందజేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళం చెవిలను ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవోకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కార్యదర్శులు ఎంపీడీవో భాస్కర్‌కు, హనుమకొండ జిల్లా దామెర మండలంలోని కార్యదర్శులు ఎంపీవో రంగాచారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని 16 పంచాయతీ కార్యదర్శులు ఎంపీవో ఆఫీసుకు వెళ్లి ఎంపీవో మారుతికి జీపీ ట్రాక్టర్ల తాళం చెవులను అందజేశారు. 16 నెలలుగా నిధులు రాకపోవడంతో అప్పులు చేసి పనులు చేపడుతున్నామని వాపోతున్నారు.