Panchayat Elections | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ పోరుకు నగారా మో గింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
తొలిదశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ 14న, తుది దశ 17న జరుగనున్నది. పోలింగ్‌కు పోలింగ్ మధ్య రెండు రోజుల వ్యవధి పెట్టారు. ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్, అదేరోజు రెండు గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఉపసర్పంచ్‌ను కూడా కూడా అదే రోజు ఎన్నుకుంటా రు. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లోని ఎస్ఈసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని మాట్లాడుతూ.. మొత్తం మూడు దశల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న కోర్టు స్టే విధించిందని చెప్పారు. ఈ నెల 27 నుంచి 29 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ నెల 30నుంచి డిసెంబర్ 2 వరకు రెండో విడత, డిసెంబర్ 3 నుంచి 5 వరకు మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తె లిపారు. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన, సా యంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ఒక రోజు అప్పీళ్ల స్వీకరణ, మరుసటి రోజు పరిష్కారం, మూడో రోజు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు.
12,728 గ్రామాలకు ఎన్నికలు
రాష్ట్రంలోని 31 జిల్లాలు, 564 మండలాల్లో గల 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది ఉన్నారని, వీరిలో పురుషులు 81,42,231, మహిళలు 85,12,455 మంది, ఇతరులు 500 ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే 3,70,244 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉ న్నట్టు తెలిపారు. రిజర్వేషన్ల గెజిట్లు సోమవారం సాయంత్రమే విడుదల చేశామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తామని కమిషనర్ చెప్పారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్‌శాఖ కా ర్యదర్శి డైరెక్టర్ సృజన, ఎన్నికల కమిషన్ కార్యదర్శి మంద మకరంద్ పాల్గొన్నారు.
32 గ్రామాల్లో ఎన్నికలు లేవు
కోర్టు వివాదాల కారణంగా 32 గ్రామాలు, 292 వార్డులను మినహాయించినట్టు చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో 25 జీపీలు, కరీంనగర్ జిల్లా వీ సైదాపూర్ మండలంలో రెండు గ్రామాలను, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఒక గ్రామం, ఎంకూర్ మండలంలోని నాలుగు గ్రామాలను ఈ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించినట్టు కమిషనర్ వివరించారు.
50వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మంగళవారం అమల్లోకి వచ్చింది. తుది విడత పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 17న ముగిసి, ఎన్నికల అధికారులు కోడ్ ఎత్తివేసే వరకు అమలులో ఉంటుంది. ఎన్నికలు జరిగే నిర్దిష్ట ప్రాంతానికి(గ్రామ పంచాయతీ లేదా వార్డు) మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో గ్రామాల్లో పలు ఆంక్షలు అమలవుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.50వేల నగదుకు మించి వెంట తీసుకెళ్లవద్దు. స్థానిక అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదు. రాజకీయ పార్టీలకు, పోటీచేసే అభ్యర్థులకు, మంత్రులకు, ఎన్నికలతో సంబంధం ఉన్న ప్రభుత్వోద్యోగులకు ఈ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. పంచాయతీ పోలింగ్ ముగిసే సమయానికి 44గంటల ముందే ప్రచారం నిలిపేయాలి. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచే మద్యంనిషేధం అమలులో ఉంటుంది. 5వేల కంటే ఎకువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు.

Panchayat Elections