రాయికల్/పాలకుర్తి, డిసెంబర్ 14: అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం (Panchayathi Elections) సాధించిన ఘటనలు ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో జరిగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, కోడలు నామినేషన్ వేయగా, కొడుకు తాళ్లపెళ్లి శ్రీరామ్‌గౌడ్ విత్‌డ్రా చేసుకున్నారు. కోడలు తాళ్లపెళ్లి రాధిక మాత్రం ఉపసంహరించుకోలేదు. బరిలో మామ తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, కోడలు రాధిక నిలిచారు. ఆదివారం ఎన్నికల్లో మామపై రాధిక 14 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గన్శ్యాందాస్నగర్ గ్రామ సర్పంచ్ స్థానానికి అత్తాకోడళ్లు పోటీపడ్డారు. అత్త సూర నర్సమ్మపై కోడలు సూర రమ 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. గ్రామంలో మొత్తం 1906 ఓట్లు పోలవగా, సూర రమకు 874, సూర నర్సమ్మకు 856 ఓట్లు పోలయ్యాయి.
ములుగురూరల్, డిసెంబర్14 : ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన నిరోష విజయం సాధించగా, ఆమె భర్త భూక్య అమర్‌సింగ్ వార్డు సభ్యుడిగా గెలిచారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉండగా, 1,2,3,5,6,7,8,9 వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అందులో 4వ వార్డు గతంలో ఏకగ్రీవం కాగా 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 6వ వార్డులో అమర్‌సింగ్ విజయం సాధించారు. కాసిందేవిపేట సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కాగా అమర్‌సింగ్ భార్య వాంకుడోతు నిరోష కాంగ్రెస్ అభ్యర్థిపై 39 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో అధికార పార్టీ బెదిరింపులను తట్టుకొని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భాస్కర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. గోపాల్పేట సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు కాగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎస్సీ మహిళ అయిన స్వప్నను బరిలోకి దింపారు.
ఇక్కడ మొదటి విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,440 ఓట్లకు గాను 4,278 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వప్నభాస్కర్కు 3,229 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 1,049 ఓట్లు రాగా స్వప్న ఏకంగా 2,180 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే రికార్డు నెలకొల్పారు.