Minister KTR | హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌కు కరెంటుపై ఏమాత్రం అవగాహనలేదని, రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలే ఇం దుకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందన్న రేవం త్ వ్యాఖ్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతుబంధుతో కేసీఆర్ డబ్బులు వృథా చేస్తున్నారని ఉత్తమ్కుమార్పేర్కొన్నారంటేనే వారి వైఖరి స్పష్టమవుతున్నదని విమర్శించారు.
కరెంట్ కావాలా? కాంగ్రె స్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కాంగ్రెస్ కావాలా? అనే విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను తెలంగాణకే కట్టడి చేయాలని మోదీ, రాహుల్ భావిస్తున్నారని, ఇంత దుర్మార్గమైన నీతిని, రీతిని అనుసరిస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి సోమవారం తెలంగాణభవన్‌లో వేర్వురుగా మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారాన్ని అణచివేయాలని పిలుపునిచ్చారు. స్వార్థం కోసం పార్టీలు మారుతూ ప్రజలను ఏమార్చే రాజగోపాల్‌రెడ్డికి ఇప్పటికే ఒకసారి మునుగోడు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని, మరోసారి అది తప్పదని హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో ఎందుకు చేరారో? తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలకు తెలియదా? అని వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాని సందర్భంలో పాల్వాయి స్రవంతి పార్టీ కోసం నిలబడిన విషయాన్ని గుర్తుచేశారు. దశాబ్దాలు కాంగ్రెస్‌కు అండగా నిలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ తీవ్రంగా అవమానించిందని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతికి, ఆమె వెంట వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తుల ఉమక్క మా ఆడబిడ్డ
‘మా ఆడబిడ్డ మా ఇంటికి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉన్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సూచన మేరకు స్వయంగా తానే ఉమకు ఫోన్ చేసి ఆహ్వానించానని, తమ ఆహ్వానాన్ని మన్నించి రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తుల ఉమను ‘ఉమక్క’అంటూ ఆప్యాయంగా సంబోధించి కేటీఆర్.. ఆమెకు గతంలో కంటే మరింత సమున్నత హోదా, బాధ్యతలు అప్పగిస్తామని, అందుకు తానే పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆమెకు బీజేపీలో అవమానం జరగడం బాధగా ఉన్నదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్తోనే మేలు: పాల్వాయి స్రవంతి
బీఆర్ఎస్తోనే తెలంగాణకు మేలు జరగుతుందని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. బాగా ఆలోచించి బీఆర్ఎస్లో చేరానని చెప్పారు. మునుగోడులో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.
మాటకు కట్టుబడని బీజేపీ: తుల ఉమ
బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటూ బీజేపీ చెప్తున్నది బిల్డప్ మాత్రమేనని తుల ఉమ విమర్శించారు. తనకు బీజేపీ వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. బీసీలకే కాకుం డా మహిళలకు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యానికి ఇం తకన్నా ఏ సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. ఇ చ్చిన మాటకు కట్టుబడని పార్టీ బీజేపీయేనని ధ్వజమెత్తారు. తాను బీఆర్ఎస్లో అనేక హోదాల్లో పని చేశానని, మళ్లీ బీఆర్ఎస్లో చేరడం తల్లిగారి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉన్నదని చెప్పారు.
గొల్లకురుమలకు అవమానం
వేములవాడ టికెట్ విషయంలో తనకు జరిగిన అవమానం గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్టు తుల ఉమ పేర్కొన్నారు. తనతోపాటు ఎందరో బీసీ నాయకులకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. బీఫాంలే సరిగా ఇవ్వలేని బీజేపీ.. బీసీ సీఎం నినాదం ఎత్తుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి హోదాకు రాజీనామా చేసినట్టు చెప్పారు.