జనగామ, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)/ఏటూరునాగారం: జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపడం ద్వారా ఆయకట్టుకు నీరందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఎగువ ప్రాంతం జనగామకు దేవాదుల నీటి అవసరం, పెండింగ్ పనులు వంటి అంశాలను వివరించి, వాటిని పరిష్కరించాలని కోరారు.
దేవాదుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష ఏర్పాటు చేశారని ప్రసార మాధ్యమాల్లో చూసి తాను స్వయంగా సీఎంను కలిసి జనగామ ప్రాంత ప్రజలు, రైతుల అవసరాలను వినతిపత్రం ద్వారా గుర్తుచేసినట్టు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో 8వ ప్యాకేజీలో భాగంగా ఉన్న జనగామ నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దేవాదులలో భాగంగా ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండలం గండిమారం రిజర్వాయర్‌కు 4 మోటర్ల ద్వారా పంపింగ్ జరుగుతుందని, అక్కడి నుంచి కన్నెబోయినగూడెం, బొమ్మకూర్ రిజర్వాయర్లకు పంపింగ్ ద్వారా నీరు చేరుతుందని తెలిపారు.
కన్నెబోయినగూడెం నుంచి లద్నూర్, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు పంపింగ్ ద్వారా నీరు చేరుతుందని, రిజర్వాయర్ల నుంచి కాలువలు, చెరువులు నింపడం ద్వారా జనగామ నియోజకవర్గం మొత్తం నీటిపారుదల అందుతుందని సీఎంకు అందజేసిన వినతిపత్రంలో వివరించారు. జనగామ నియోజకవర్గంలో మిగిలిపోయిన 20శాతం ఆయకట్టు అందుబాటులోకి రావాలంటే 530 ఎకరాల భూసేకరణ డబ్బులు, పిల్ల కాలువలకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా తరిగొప్పుల మండలంలోని 15 గ్రామాలకు నీళ్లు వచ్చే లిఫ్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని, అర్ధాంతరంగా ఆగిపోయిన మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి కాలువ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
అంతకుముందు ఎమ్మెల్యే పల్లా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2002లో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కోసం కొబ్బరికాయ కొట్టి వెళ్లారని తెలిపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పనులు చేపట్టి దాదాపు 47వేల ఎకరాలకు నీరు అందించిందని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునఃపరిశీలన చేసి, రూ.1,475 కోట్ల నిధులు ఒక్క టన్నెల్‌కే ఖర్చు పెట్టినట్టు తెలిపారు.
రూ.7,800 కోట్లతో గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన కృషి వల్ల దాదాపుగా 3.17 లక్షల ఎకరాలకు నీరు అందుతున్నదని తెలిపారు. 30వేల ఎకరాల భూ సేకరణ సైతం పూర్తయిందన్నారు. మరో 2.40 లక్షల ఎకరాలకు నీరు రావాలంటే 3వేల ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. అదేవిధంగా రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే 2.40 లక్షల ఎకరాలకు అదనంగా నీరు వస్తుందని తెలిపారు.