జనగామ రూరల్, ఏప్రిల్10: ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు. జనగామ రూరల్ మండలంలోని పెంబర్లి, పెద్దపాడు, గానుగు పహాడ్, వెంకిర్యాల, అడవి కేశవాపూర్, ఎర్ర గొల్ల పహాడ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ యాసంగికి బొమ్మకూరు నుంచి కుడి కాలువ ద్వారా నీళ్లు అందిచడంలేదనీ పెంబర్తి రైతులు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు. కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ నీరు అందలేదని చెప్పారు. దీంతో కొన్ని పంటలు ఎండిపోయాయని చెప్పారు.
దేవాదుల మూడో దశ మోటార్లు మొదలయ్యాయని, మొదటి దశలో 350 క్యూసెక్కులు, రెండో దశలో 550 క్యూసెక్కులు, మూడో దశలో 1800 క్యూసెక్కులతో నీరు వస్తుందన్నారు. ప్రస్తుతం ఒకటో దశ ప్రారంభమైందని, రెండోది నెల రోజుల్లో, మూడోది మరో రెండు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా రెండు పంటలకు నీరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ రానట్లయితే అధికారులతో తాను మాట్లాడుతానని వెల్లడించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ప్రతి రైతు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం చూపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ గాడిపల్లి ప్రేమ లతారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు చిర్ర శ్రీనివాస్ రెడ్డి, నిమ్మతి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్, రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ బురెడ్డి ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, రేఖ, బోళ్ల సంపత్ యాదవ్, ముస్తాల దయాకర్, యాకూబ్ పాషా, శ్రీనివాస్, శంకర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.