హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదం అని, ఊసరవెల్లే సిగ్గు పడేలా నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచుతాడని మండిపడ్డారు. తన స్వార్థం కోసం మోసాలు చేస్తూ పబ్బం గడుపుకొంటాడని నిప్పులు చెరిగారు.
తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్ను సైతం వదలలేదని మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి పంచన చేరి, పిచ్చికూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తాడు. గతంలో కేసీఆర్ కడియం శ్రీహరిని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కట్టబెట్టి, ఆయన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తే.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం ఎంత సబబు అని నిలదీశారు. నీలాంటి నీచమైన రాజకీయ నాయకుడు లేడని, ప్రజలు అంతా గమనిస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.