ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కడియం శ్రీహరి కన్నేసిన 50ఎకరాల అటవీ భూములను కాపాడేందుకు తాను కాపలాకుక్కనవుతానని, ఆయనలా మాత్రం గుంటనక్కనో, ఊసరవెల్లినో కానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం జనగామ లోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో కడియంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొచ్చుకుక్క అంటూ ఇటీవల తనపై కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పల్లా ఘాటుగా స్పందించారు. కడియం బినామీల కబ్జా చెర నుంచి దేవునూరు అటవీ భూములను రక్షించేందుకు ప్రజల పక్షాన పోరాటం చేస్తానని స్పష్టంచేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజల కోసం తాను కాపలాకుక్కలా ఉంటానని తెలిపారు. ‘నిజమే. నేను కుక్కనే! నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటా. బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు విశ్వాసం కలిగిన కుక్కలా పనిచేస్తా! నీ చెర నుంచి అటవీ భూములు కాపాడేందుకు రేసుకుక్కనవుతా. అధికారవాంఛ, ధనదాహం కోసం ఊసరవెల్లులే సిగ్గుపడేలా పార్టీలు మారిన నువ్వా నాపై విమర్శలు చేసేది?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ సభను అడ్డుకోలేరు..
‘బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. ఇది ప్రజా జాగరణగా చరిత్ర సృష్టించబోతున్నది. 2001లో చంద్రబాబు ప్రభుత్వం కూడా గులాబీ బహిరంగ సభలకు అనేక అడ్డంకులు సృష్టించింది. అయినా ఆగలేదు సరికదా ఇదే గడ్డపై దేశంలోనే అతిపెద్ద సభతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పుడు కూడా అడ్డంకులకు దీటుగా ప్రజలే ప్రతిస్పందిస్తారని ధీమా వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీని ఓ తమాషాగా మార్చేశారని, ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నిలదీస్తే కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎదురుదాడి చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాబడి వృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయిందని తెలిపారు.