Congress | కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం.. రిజర్వాయర్లకు చేరని కృష్ణా నీళ్లు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు చేపట్టిన ఈ పథకం కోసం 5 భారీ రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి. నడిపేందుకు పంపులూ రెడీగా ఉన్నాయి.
- కేవలం 2.5 కి.మీ. కాలువ తవ్వని కారణంగా 5 రిజర్వాయర్లకు చేరని కృష్ణా నీళ్లు
- పాలమూరు-రంగారెడ్డిలో ఐదు భారీ రిజర్వాయర్లను నిర్మించిన కేసీఆర్ సర్కార్
- కృష్ణా నీళ్లు ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లు సైతం సిద్ధం
- కొసరు పనినీ చేపట్టని రేవంత్ సర్కార్ నిర్వాకంతో ఉన్న నీళ్లూ ఆంధ్రా పాలు
కరువులోనూ కల్పతరువుగా నిలువాలని గత కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు భారీ రిజర్వాయర్లను సిద్ధం చేసింది. శ్రీశైలం నుంచి ఆయా రిజర్వాయర్లలోకి నీటిని ఎత్తిపోయడానికి పంపులనూ రెడీ చేసింది. వందల కిలోమీటర్ల మేర కాలువలనూ తవ్వించింది. జస్ట్.. 2.5 కిలోమీటర్లు తవ్వితే మొత్తం సంపూర్ణమయ్యేది. ఎన్నికలు రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మీద కోపమో లేక పాలమూరు బిడ్డల మీద పగో తెలియదు గానీ, మిగిలిపోయిన 2.5 కిలోమీటర్ల కాలువ పనులను పూర్తిచేయకుండా రేవంత్ సర్కార్ రెండున్నరేండ్లుగా కాలయాపన చేస్తున్నది.
శ్రీశైలంలో నీళ్లున్నయ్. ఇప్పటికైనా 32 టీఎంసీలు పాలమూరుకు పారించుకోవచ్చు. నామమాత్రంగా ఎత్తితేనే నార్లాపూర్‌లో కొన్ని నీళ్లు చేరినయ్. పూర్తిగా వాడుకుంటే 6.4టీఎంసీల దాకా నీళ్లు నింపొచ్చు. కానీ అక్కడినుంచి ఏదులకు నీళ్లు పారాలంటే మధ్యలో 2.5 కిలోమీటర్ల దూరం కాలువ లేదు. కాంగ్రెస్ సర్కార్ పూర్తిచేయలేదు. ఫలితంగా శ్రీశైలం నుంచి నార్లాపూర్ దాకా చేరిన నీళ్లు.. ఏదుల రిజర్వాయర్‌కు అందలేదు. వట్టెం రిజర్వాయర్‌ను తాకలేదు. కరివెనకు కదలలేదు. ఉద్ధండాపూర్ను చేరలేదు. ఏనుగు పోయి, తోక చిక్కి నట్టు.. పాలమూరు-రంగారెడ్డి మహాప్రాజెక్టును కేసీఆర్ సర్కారే పూర్తిచేసింది కానీ, 2.5 కిలోమీటర్ల కాలువను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనూ తవ్వలేకపోయిన ఫలితమిది. కృష్ణా తలాపునే ఉన్నా.. పాలమూరు పడావు పడింది. అవకాశమున్నా వదిలేసి, కాంగ్రెస్ కరువును తెచ్చింది.
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. అయితే 8.32 కిలోమీటర్ల పొడవున్న ఓపెన్ కెనాల్ పనుల్లో కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఇంకా 2.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కృష్ణమ్మ జల ప్రవాహానికి బ్రేకులు పడ్డాయి. మధ్యలోనే కాలువలో కృష్ణా జలాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)పై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు చేపట్టిన ఈ పథకం కోసం 5 భారీ రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి. నడిపేందుకు పంపులూ రెడీగా ఉన్నాయి. కేవలం 2.5 కిలోమీటర్ల కాలువ పనులే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు పూర్తయి ఉంటే కృష్ణమ్మ ఉద్దండాపూర్ వరకూ చేరుకునేది. కొంతలో కొంతయినా పాలమూరు జిల్లాకు ఉపశమనం లభించేది.
కానీ, కేవలం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో కృష్ణా జలాలు ఏపీకి తరలిపోయాయి. మూడేండ్లుగా కొద్దిపాటి కాలువ పనులను పూర్తిచేయని కాంగ్రెస్ వైఫల్యం ఇప్పుడు ఉమ్మడి జిల్లాకే శాపంగా పరిణమించింది. కృష్ణా జలాలను వినియోగించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు కరువుబారిన పడింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటికుంటలు, చెరువులను నింపాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది లక్ష్యం.
పాలమూరు పనులకు 2015లోనే శ్రీకారం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లోనే శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించి, అందులో 18 ప్యాకేజీల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నాడే చేపట్టింది. బీఆర్ఎస్ అధికారంలోంచి దిగిపోయేనాటికి నార్లాపూర్-ఏదులకు నీటిసరఫరా చేసే 8.32 కి.మీ. ప్రధాన కాలువలో దాదాపు 4.95 కి.మీ. పూర్తయింది. కేవలం 3.82 కి.మీ. మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా నీటి సరఫరా వ్యవస్థ మొత్తాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. సూటిగా చెప్పాలంటే ‘ఏనుగు ఎల్లింది తోక చిక్కింది’ అన్నట్టుగానే పనులు మిగిలి ఉన్నాయి. తాగునీటి సరఫరా పనులు పూర్తయ్యే దశలోనే దాదాపు రూ.10 వేల కోట్లతో సాగునీటి కాలువల తవ్వకానికి సైతం బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే పెండింగ్‌లో పడిపోయాయి. తొలుత టెండర్లనే రద్దు చేసి మరింత జాప్యానికి ఒడిగట్టింది.
మూడేండ్లలో పూర్తిచేసింది ఒక్క కి.మీ. కాలువ పనులే
నార్లాపూర్- ఏదుల కెనాల్లో మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తండ్లాడుతున్నది. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు మధ్య ప్యాకేజీ-3లో కేవలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి 3.82 కి.మీ. కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కాలువ మార్గంలో పెద్ద బండరాళ్లు ఉండటంతో కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నది. అందుకు అంచనాలను సవరించాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కార్ సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టి తుదకు అంచనాలను సవరించింది. పనులను ప్రారంభించి రెండేండ్లు గడచినా ఇప్పటికీ పూర్తిచేయలేదు. గడచిన మూడేండ్లలో రేవంత్ సర్కార్ ప్రభుత్వం పూర్తిచేసింది ఒక్క కి.మీ. కాలువ పనులే. ఇప్పటికీ నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి, కొల్లాపూర్ మండలం కుడికిళ్ల మధ్యన 2.5 కి.మీ. ఓపెన్ కెనాల్ తవ్వకం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పనులు పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం శ్రీశైలం నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను ఎత్తిపోసుకొని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా ఆయా రిజర్వాయర్ల పరిధిలోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగడంతోపాటు, నీటికరువును ఎంతో కొంతయినా అధిగమించే పరిస్థితి ఉండేది. అంతేకాదు ఏదుల, వట్టెం రిజర్వాయర్ల నుంచి కల్వకుర్తి కాలువకు నీళ్లను అందించే వెసులుబాటు కూడా ఉన్నది.
యథేచ్ఛగా ఏపీ కృష్ణాజలాల మళ్లింపు
తెలంగాణ సర్కార్ వైఫల్యంతో మరోవైపు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఏపీ సర్కార్ యథేచ్ఛగా తరలించుకుపోతున్నది. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గం వరకూ కృష్ణా జలాలను తరలించింది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ ఏపీ సర్కార్ ఒక్క శ్రీశైలం నుంచే 60 టీఎంసీలను మళ్లించింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ కల్వకుర్తి ద్వారా కేవలం 11 టీఎంసీలను మాత్రమే మళ్లించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ఉంటే ఆయా రిజర్వాయర్లలో కలిపి దాదాపు అదనంగా మరో 60 టీఎంసీలను నిల్వ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ సర్కార్ జారవిడిచింది.
రెండున్నర కిలోమీటర్ల దూరం.. రెండున్నరేండ్ల ఘోరం
తలాపునే శ్రీశైలం.. వాడుకోలేని దైన్యం..
ఇది శ్రీశైలం రిజర్వాయర్. దీని పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. వేసవి కారణంగా జూన్ 1నాటికి జలాశయంలో నీటినిల్వ 39 టీఎంసీలకు పడిపోగా.. వానకాలంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఆగస్టు13 నాటికి నిల్వలు మళ్లీ 185 టీఎంసీలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 62 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు కనిష్ఠ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలను తీసేస్తే, 32 టీఎంసీల మేర నీటిని ఈ క్షణానికీ వాడుకోవచ్చు.

శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 240 మీటర్ల ఎత్తులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) ప్రారంభమవుతుంది. 2.17 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ నుంచి హెడ్ రెగ్యులేటర్, 0.911 కిలోమీటర్ల పొడవుతో మూడు సొరంగాలు, మొత్తం 9 మోటర్లతో నార్లాపూర్ పంప్‌హౌస్ ఉంటుంది. దీనిద్వారా ఎత్తిన నీటిని అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్‌లో పోస్తారు. అయితే, మొన్నటివరకు ఒకే ఒక్క మోటర్తో మాత్రమే కాంగ్రెస్ సర్కార్ నీటిని పంప్ చేసింది.
నార్లాపూర్‌లో నామమాత్రంగా..

ఇది అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్. నార్లాపూర్ పంప్‌హౌస్ ద్వారా ఎత్తిన నీళ్లు.. ఈ రిజర్వాయర్‌లోకి చేరడంతో జలాశయంలో కొద్దిమేర నీళ్లు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో నీటిని ఎత్తితే, 6.4 టీఎంసీల వరకూ నిల్వ చేయొచ్చు. ఇక్కడి నుంచి కృష్ణా నీటిని 8.32 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 15.755 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా ఏదుల పంప్‌హౌస్‌కు తరలించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నీటిని ఎత్తి వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్‌లో పోస్తారు.
పెండింగ్‌లో పనులు- ఆగిన కృష్ణమ్మ పరుగులు

నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. అయితే 8.32 కిలోమీటర్ల పొడవున్న ఓపెన్ కెనాల్ పనుల్లో కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఇంకా 2.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండున్నరేండ్లు దాటినా ఈ పనులు మాత్రం అంగుళం కూడా పూర్తిచేయలేదు. దీంతో మధ్యలోనే కాలువలో కృష్ణా జలాలు నిలిచిపోయాయి.
ఎండిపోతున్న ఏదుల

ఇది వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్. 6.55 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేయవచ్చు. ఇక్కడి నుంచి 3.1 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 22 కిలోమీటర్ల పొడవుతో 2 సొరంగాల ద్వారా వట్టెం పంప్‌హౌస్‌కు జలాలను తరలిస్తారు. వట్టెం పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తి వెంకటాద్రి రిజర్వాయర్‌లో పోస్తారు. ఇక్కడ అన్ని పనులు పూర్తయ్యాయి. అయితే, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు రావాల్సిన కాలువలో 2.5 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు చేరక, రాళ్లు తేలే పరిస్థితి నెలకొన్నది.
వట్టిపోయిన వట్టెం

ఇది వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్. నీటి నిల్వ సామర్థ్యం 16.74 టీఎంసీలుగా ఉన్నది. ఇక్కడి నుంచి 9.75 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్‌కు జలాలను తరలిస్తారు. దీనికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే, ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతో వట్టెం రిజర్వాయర్ ఇప్పుడు వట్టిపోయినట్టు తయారయ్యింది.
కరివెనకు కన్నీళ్లు

ఇది కురుమూర్తి (కరివెన) రిజర్వాయర్. నిల్వ సామర్థ్యం 17.34 టీఎంసీలు. కురుమూర్తి రిజర్వాయర్ నుంచి 8.935 కిలోమీటర్ల పొడవుతో ఉన్న రెండు సొరంగాల ద్వారా కృష్ణ జలాలను ఉద్దండాపూర్ పంప్‌హౌస్‌కు తరలిస్తారు. ఇక్కడ నుంచి నీటిని ఎత్తి ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌లో పోస్తారు. సొరంగాలు పూర్తికాగా, పంప్‌హౌస్ పనులు చివరిదశలో ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో వట్టెం రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతో కురుమూర్తి రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరింది.
ఉసూరుమంటున్న ఉద్ధండాపూర్

ఇది ఉద్ధండాపూర్ రిజర్వాయర్. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక ఎత్తులో ఉన్న రిజర్వాయర్. ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) 629 మీటర్లుగా ఉంటుంది. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.03 టీఎంసీలు. ఇప్పటికే పనులన్నీ పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి సాగునీటి కాలువలను చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ నిర్వాకంతో పైనుంచి నీళ్లు రాక.. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

