మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 19 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు చెరువులు నింపి సాగు విస్తీర్ణాన్ని పెంచినట్టు తెలిపారు. గతంలో రెండు లక్షల ఎకరాలు సాగులో ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో రైతులు పంటలు పండించాలంటే మోటర్లు ఉపయోగించేవారని, బీఆర్ఎస్ హయాంలో కృష్ణానది నీటితో పట్టణం, తండాలకు అందించినట్టు చెప్పారు.
జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 6, 7 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే వరదలు వచ్చిన నీటితో 40 రోజుల్లో 60 టీఎంసీలతో రిజర్వాయర్లను నింపుకొనే సామర్థ్యం కలిగిన మోటర్లు ప్రాజెక్టులో ఉంచామని, పది శాతం పనులు పూర్తి చేస్తే 12.32 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని తెలిపారు. టెండర్లు పిలిస్తే వాటిని రద్దు చేశారని, నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సాగునీరు దక్కకుండా చేసేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ప్రయత్నం చేస్తున్నాయని, ఆర్డీఎస్ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.