PRLIS | హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా (PRLIS) మారింది. రేవంత్‌రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ కోరిన సమాచారాన్ని ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతోనే డీపీఆర్‌ను తిరస్కరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేయడం ఇందుకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30లక్షల ఎకరాల సాగు నీరు, తాగునీటిని అందించే లక్ష్యంతో 2015లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.35వేల కోట్ల అంచనా వ్యయంతో మొదటిదశలో తాగునీటి పనులను, రెండో దశలో సాగునీటి పనులను పూర్తి చేయాలని భావించింది. ప్రాజెక్టుకు ఏపీ సర్కారు, తెలంగాణలోని ప్రతిపక్షం మోకాలడ్డాయి. ఎన్జీటీ, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, జోనల్ కౌన్సిల్లో కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టించారు. కేసీఆర్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో అడ్డంగులను అధిగమించింది. 90టీఎంసీల నికర జలాలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించింది.
డీపీఆర్‌ను సిద్ధం చేసి 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) పలుసార్లు ప్రతిపాదనలను పక్కనపెట్టింది. కరువు ప్రాంత పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం ఈఏసీకి వివరించగా ఎట్టకేలకు ఈఏసీ ఒప్పుకుంది. అనుమతుల మంజూరుకు కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతులు అడగలేదు.
పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నామని సీడబ్ల్యూసీ ఇటీవల స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరే కారణమంటూ లేఖ రాసింది. 2022 సెప్టెంబర్ 13 నుంచి అప్రైజల్ తమవద్ద పెండింగ్‌లో ఉందని పేరొన్నది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీలను వాడుకుంటామన్న రాష్ట్రపభుత్వం ఆ వివరాలు అడిగితే స్పందించలేదని తెలిపింది. ఈ నెల 22న లేఖ రాశామని గుర్తుచేసింది. డీపీఆర్‌ను పరిశీలన జాబితా నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జనవరి 4న కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి, పాలమూరు ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు. జనవరి 29న కేంద్రం తెలంగాణ సర్కారుకు స్పష్టమైన జవాబు చెప్పింది. ట్రిబ్యునల్ వివాదం వల్ల అనుమతులివ్వలేమని, మరోవిధంగా ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ సర్కారుకు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఓ సామాజికకార్యకర్త ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా కేంద్రమే ఈ మేరకు వెల్లడించింది. నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ హమీద్‌ఖాన్ మేలో విరమణ పొందారు. ఆయన స్థానంలో సినీయర్ ఇంజినీర్‌ను నియమించి అనుమతుల కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. స్థానిక ఎస్ఈకే ఈ బాధ్యతలను అప్పగించింది. వీటితో పాటు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు కీలకమైన ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరణకు గురైందని ఇంజినీరింగ్ నిపుణులు ఆక్షేపిస్తున్నారు.