MLA Paidi Rakesh Reddy | నిజామాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ముఖాముఖి ప్రశ్నలో కవిత, కేటీఆర్ ప్రస్తావన రావడంతో తన వ్యక్తిగత అభిప్రాయమని నొక్కి చెబుతూ కీలక ప్రకటన చేశారు. జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కవిత అంటే గౌరవం, కేటీఆర్ అంటే ఇష్టమంటూ తెలిపారు.
‘ఆ బాధ రావొద్దు… వచ్చింది కాబట్టే నేననుకుంటాను దేవుడు ఎంతో మందిని క్షమిస్తాడు… మా సోదరిని క్షమించమని కోరుకుంటా’నని చెప్పుకొచ్చారు. రాజకీయాలు, వ్యక్తిగతం వేర్వేరు అంటూ స్పష్టం చేశారు. కవిత ఇందూరు కోడలు అంటూ పేర్కొన్నారు. విధానపరంగా పోరాటం చేసేటప్పుడు రాజీలేదని బీజేపీ ఎమ్మెల్యే అంటూనే తన మనసులోనే భావాలను వ్యక్తపరిచారు. కన్నబిడ్డ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందని పెద్దాయన ప్రత్యేక పరిస్థితుల్లో కవితను కలవలేక పోతున్నట్టుగా పైడి రాకేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.