Karnataka election | హైదరాబాద్/సిటీబ్యూరో, మే6 (నమస్తే తెలంగాణ): బ్రిటిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది. చేనేతపై జీఎస్టీ విధించడమే అందుకు నిదర్శనమని మండిపడింది. శనివారం హిమాయత్‌నగర్‌లో జాతీయ పద్మశాలి సంఘం చేనేత కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకటన్న మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ శారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వం కూడా ఉప్పుపై, చేనేత వస్త్ర పరిశ్రమపై పన్నులు వేయలేదని గుర్తుచేశారు. కానీ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల మాదిరే పన్నులు వేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇదేనా మేకిన్ ఇండియా, స్వదేశీ? అని ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, అయినా కేంద్రం నుంచి స్పందన లేదని వాపోయారు. చేనేత కళాకారులు, పారిశ్రామికులు, వ్యాపారులు, వినియోగదారులు, అభిమానులు, సామాజిక ఉద్యమకారులు జాగృతమయ్యారని, కర్ణాటకలో ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్తారని తెలిపారు.