మణుగూరు టౌన్, జూన్ 23: డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవాన్ని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి ఆయన వివరించేవారు. కనీస సౌకర్యాలు లేని గ్రామాలకు కూడా కాలినడకన వెళ్లి మరీ వనదేవతల చరిత్రను కళారూపంలో చాటి చెప్పేవారు.
డోలు వాయిద్యకారుడైన రామచంద్రయ్యను 2022 జనవరి 26న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 2022 మార్చి 28న ఢిల్లీలో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న డోలువాయిద్య కళాకారుడు తెలుగు రాష్ర్టాల్లో సకిని రామచంద్రయ్య ఒక్కరే కావడం విశేషం. రామచంద్రయ్య మృతిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.