చిన్నశంకరంపేట, మే 28 : ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌తో ఫోన్లో మాట్లాడి, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలని కోరారు. నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.
అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. న్లైనా, ధాన్యం తూకం ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి ముద్దవుతుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద అనేక సమస్యలు రైతులను వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ధాన్యం పూర్తిస్థాయిలో కొనకుంటే రైతులతో కలసి ఆందోళనలు చేపడుతామని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.
చిల్పూరు, మే 28: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు అరిగోస పడుతున్నారని, ధాన్యం కొనే దిక్కులేదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్ర హం వ్యక్తంచేశారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం లింగంపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నట్టు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, మిల్లర్లు అదనపు తూకాలు వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో ఒకగింజ మిగలకుండా కొనేస్తామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులను మోసగించారని విమర్శించారు. వారం లో ధాన్యం మొత్తం కొనకపోతే రైతులందరితో మహాధర్నా చేస్తామని హెచ్చరించారు.