మెదక్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలనుఅవలంబిస్తుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) ఆరోపించారు. రైతు భరోసాపై(Rythu bharosa) సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ వాన కాలం పంటకి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలలోఆచరణకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిలువునా మోసం చేస్తోందన్నారు. ఎకరానికి 7,500 రైతులకు పెట్టుబడి సాయంకింద ఇవ్వకుండా రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.