జమ్మికుంట, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
మానకొండూర్ సీఐతో కరీంనగర్ సీపీ టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం లేదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఇంట్లోనే వెల్లడించడం ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడానికి బలమైన ఉదాహరణగా పేర్కొన్నారు. పోలీసుల ఇంటర్నల్ విషయాలు ఎమ్మెల్యేకు ఎలా తెలిశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటున్నదని ఆరోపించారు.
బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మానకొండూర్ ఎమ్మెల్యే పోస్టింగులు ఇప్పించుకుంటే.. తనకూ ఇప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అర్హులందరికీ ఎందుకు చేయడంలేదని నిలదీశారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నాయకులతో పంపిణీ చేయడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిధుల మంజూరు కోసం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతానని స్పష్టంచేశారు.