Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ , నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వరి కోతలు, ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎమ్మార్ సేకరణపై బీఆర్కే భవన్లో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దేశంలో రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం ఆరబెట్టి తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. టార్పాలిన్లు, పాడీ క్లీనర్ మిషన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చూడాలని, కొనుగోలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాత బియ్యం ఇస్తేనే.. కొత్త ధాన్యం
సీఎమ్మార్(బియ్యం) ఇవ్వటంలో జాప్యం చేస్తున్న మిల్లులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో సీఎమ్మార్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గత సీఎమ్మార్‌ను ఈ నెల 30లోపు అందజేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సీఎమ్మార్‌ను ఇచ్చిన వారికే ఈ సీజన్లో ధాన్యం కేటాయిస్తామని, లేనిపక్షంలో ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కొందరు మిల్లర్లు డీఫాల్ట్ అయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్త మిల్లులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సీఎమ్మార్ విధానంలో లేని మిల్లులు ఈసారి కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే ధాన్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
నాడు 3 వేల కోట్లు.. నేడు 26 వేల కోట్లు
సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యవసాయరంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రులు తెలిపారు. 2014-15లో ధాన్యం కొనుగోలు కోసం రూ.3,392 కోట్లు ఖర్చు చేయగా 2020-21లో ఇది రూ.26,600 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఎనిమిదేండ్లలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.23,208 కోట్లు పెరిగిందని తెలిపారు. నాటితో పోల్చితే కొనుగోలు చేసే ధాన్యం ఆరు రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, సీఎస్ శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్లతోపాటు ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులు పాల్గొన్నారు.