హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ) : ముఖ్యనేత, కీలక నేత మధ్య వడ్ల పం చాయితీ ముదిరిందా? కొనుగోలు వైఫల్యం పై ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్ఠానానికి రహస్య నివేదిక పంపుకొన్నారా? సీనియర్ మంత్రి అని స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించు కోలేకపోయిండని ముఖ్యనేత అసంతృప్తి వ్యక్తంచేశారా? ధాన్యం కొనుగోలు తంతును కుప్ప చేసి పెట్టిండని నిట్టూర్పుతో ఉన్నారా?‘నేను పట్టించుకుంటే తన శాఖలో వేలు పెడుతున్నాడని కింది నుంచి మీది దాకా ఫిర్యాదులు చేస్తరు.. అలా అని ఫ్రీ హ్యాండ్ ఇస్తే ప్రతిపక్షాల చేతిలో ఆయుధం పెట్టిండు’ అని ముఖ్యనేత అధిష్ఠానానికి చెప్పుకొన్నారా? కీలక నేత కూడా అంతే స్థాయిలో స్పందించారా?
‘నిధులు లేకుండా ఉత్త కొనుగోలు కేంద్రాలతో ధాన్యం ఎలా కొనగలను?’ అని అధిష్ఠానానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారా? ‘140 లక్షల టన్నుల ధాన్యం పండితే.. అందులో సగం ధాన్యమే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇస్తే..మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలి?’ అని లేఖలో పేర్కొన్నారా? ‘గన్నీ బ్యాగుల కొరత తీర్చకుండా.. పాత ధాన్యం గోదాముల్లోనే నిల్వపెట్టి కొత్త ధాన్యం కొనుమంటే ఎట్లా?’ అని కీలక నేత ఎదురు తిరిగారా? అంటే కాంగ్రెస్ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వ్యక్తులు ‘అవును’ అనే అంటున్నారు. ఈ యాసంగిలో దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చినట్టు అంచనా. సివిల్ సైప్లె శాఖ నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 58 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఇంకా 83 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి.
వ్యతిరేకత తీవ్రతను అంచనా వేసిన ముఖ్యనేత ఇదంతా కీలక నేత వైఫల్యమేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ధాన్యం కొనుగోలు ప్రణాళికలు రూపొందించటం, అవసరమైనన్ని గోనె సంచులు తెప్పించడం, కూలీలను సమకూర్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అధిష్ఠానానికి రహస్య నివేదిక పంపినట్టు తెలిసింది. సీనియర్ మంత్రి కదా అని స్వేచ్ఛ ఇచ్చానని..అన్నీ ఆయనే చూసుకుంటారనే ఆలోచనతో తాను ఆ శాఖను పట్టించుకోలేదని, తాను ఏమైనా సలహాలు, సూచనలిచ్చినా..‘అగో! నా శాఖలో వేలు పెడుతున్నారు’ అని కింది నుంచి మీది దాకా ఫిర్యాదులు చేస్తారని, గతంలో అట్లా ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయని కొన్నిటిని ఉదహరించినట్టు తెలిసింది. వడ్ల కొనుగోలు వ్యవహారాన్ని కుప్ప చేసి పెట్టారని, రైతులతో నేరుగా ముడిపడి ఉన్న ఈ వ్యవహారం ప్రభుత్వానికి భారీ నష్టాన్నే తెచ్చిపెట్టిందని రహస్య నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. సీఎంఆర్ బియ్యంలో మిల్లర్ల స్కామ్‌కు అంతే లేదని, అక్రమాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయినట్టు తెలిసింది. ఆధారంగా ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ చేసిన దాడు ల వివరాలను పొందుపరిచినట్టు సమాచారం.
ముఖ్యనేత రహస్యంగా నివేదిక పంపారని, ధాన్యం కొనుగోలు వైఫల్యాన్ని పూర్తిగా తన మీదికి నెట్టివేసే ప్రయత్నం చేశారని పసిగట్టిన కీలక నేత తాను కూడా అధిష్ఠానానికి సుదీర్ఘ లేఖ రాసినట్టు తెలిసింది. తాను వరి కోతలకు ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నానని, ఈ సీజన్‌కు ఎంత పంట ఉత్పత్తి అవుతుందనే సమగ్ర వివరాలు వ్యవసాయ శాఖ నుంచి తెప్పించి అందుకు అనుగుణంగా తన శాఖ అధికారులతో సమావేశాలు పెట్టానని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, కనీస మద్దతు ధరతో ఈ పంట కొనుగోలుకు దాదాపు రూ.25,112 కోట్లు అవసరమని, దాదాపు 25 కోట్ల గోనె సంచులు కావాల్సి ఉంటుందని ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టామని, వడ్ల కొనుగోలుకు కనీసం రూ.10 వేల కోట్ల నిధి ఏర్పాటు చేయాలని అడిగామని, అయినా ముఖ్యనేత నుంచి ఎలాంటి స్పందనా లేదని లేఖలో వివరించినట్టు సమాచారం.
తీరా వడ్లు కల్లాల్లో రాశులు పడ్డ తర్వాత 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతించారని, కానీ అప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదని కీలక నేత తీవ్ర ఆరోపణ చేసినట్టు తెలిసింది. అనుమతించిన ధాన్యం కొనుగోలుకు రూ.21,112 కోట్లు అవుతుందని, ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ.19,112 కోట్లు అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. ఫైనాన్స్ నుంచి అప్పుడు రూ.100 కోట్లు, ఇప్పుడు రూ 100 కోట్లు బిచ్చం వేసినట్టు విదిలిస్తుంటే తానేం చేయగలనని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.