సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఏళ్ల తరబడి కోర్టు వివాదాల్లో నలిగిపోయి, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాక కూడా నిరుపయోగంగా మారిన గౌలిపురా మేకలు, గొర్రెల కబేళాకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ ఆధునిక కబేళాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రూ.5.69 కోట్ల అంచనాతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతుల కోసం స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించి, కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. గౌలిపురాలో రోజుకు 400 గొర్రెలు/మేకల కోత సామర్థ్యంతో ఆధునిక కబేళా నిర్మించేందుకు గతంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థకు జీహెచ్ఎంసీ ఈపీసీ కాంట్రాక్ట్ అప్పగించింది. దీనికోసం రూ.4.38కోట్లు వెచ్చించి విదేశాల నుంచి యం త్రాలు, పరికరాలు తెప్పించి అమర్చారు. సంబంధిత స్థల యా జమాన్య హక్కులపై పలు వివాదాలు చెలరేగి, కోర్టు కేసులు దాఖలయ్యాయి. దీంతో 90 శాతం పనులు పూర్తయిన దశలో, దాదాపు 12 ఏళ్లకు పైగా ఈ ప్రాజెక్టు పనులు మూలనపడ్డాయి.
హైకోర్టు తీర్పుతో సమసిన వివాదం..
8 సెప్టెంబరు, 2023న హైకోర్టు ఇచ్చిన ఉమ్మడి తీర్పుతో భూవివాదాలన్నీ సమసిపోయాయి. తీర్పు అనంతరం గౌలిపురాలోని పాత కబేళా కాంపౌండ్ వాల్ పరిధిలో జీహెచ్ఎంసీకి 1,873.53 చదరపు మీటర్ల (దాదాపు 0.463 ఎకరాలు) స్థలం లభించింది. కోర్టు కేసులు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 5, 2024న చార్మినార్ జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, స్థానికులతో కలిసి ఉమ్మడి తనిఖీ నిర్వహించారు. ఏళ్ల తరబడి మూతపడటంతో యంత్రాలు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు పాడైపోయాయని, సమగ్ర మరమ్మతులు చేయకుండా దీనిని ప్రారంభించడం సాధ్యం కాదని అధికారులు తేల్చారు. ఈ క్రమంలోనే కన్సల్టెన్సీ సంస్థ ఏటీకే ఇంజనీరింగ్ సర్వీసెస్ అందించిన నివేదిక (జూన్ 8, 2026) ఆధారంగా రూ.5.69 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.