హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): గతేడాది కంటే ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందం టే మీరు నమ్ముతారా? కానీ, వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నది. నిరుడు ఇదే సమయానికి 52 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ప్రస్తుతం 56 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్టు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడించింది! ఇదే ఆశ్చర్యం. ఓవైపు రాష్ట్రమంతటా ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. అప్పుడప్పుడు మబ్బులే తప్ప వానలు పడటం లేదు. ఒక్కోరోజు వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తున్నది. పంటలు సాగు చేసేందుకు రైతులు వెనుకాడుతున్న పరిస్థితి. అయినప్పటికీ, వ్యవసాయ శాఖ మా త్రం అంతా సస్యశ్యామలంగా ఉన్నట్టు నివేదికలు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
వర్షాలే లేవు… పెరిగిన వరి, పత్తి సాగు
వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రం లో పత్తి, వరి సాగు జోరుగా జరుగుతున్నది. ఎల్ నినో, కరువు, వర్షాలతో సంబంధం లేకుండా ఈ రెండు పంటల సాగు కొనసాగుతుండటం గమనార్హం. అది కూడా గత ఏడా దితో పోల్చితే అధికంగా సాగవుతున్నది! వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు పత్తి పంట 40లక్షల ఎకరాల్లో సాగైంది. నిరుడు ఇదే సమయానికి 34 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే గత ఏడాదితో పోల్చితే ఆరు లక్షల ఎకరాల్లో అధికంగా పత్తి సాగు కావడం గమనార్హం. సాధారణ సగటు తీసుకున్నా, ఇప్పటివరకు పత్తి 36 లక్షల ఎకరాల్లోనే సాగు కావాలి. కానీ, అంతకుమించి సాగు కావడం గమనార్హం. ఇది ఇలా ఉంటే, నిరుడు ఇదే సమయానికి 3.5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు పేర్కొన్నది. అంటే గత సంవత్సరంతో పోల్చితే లక్ష ఎకరాల్లో వరి సాగు పెరిగింది. సాధారణ సాగు లక్ష్యం 3.9 లక్షల ఎకరాలను మించి సాగైంది. కంది గత సంవత్సరం 3.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తతం 3.19 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ నిరుడు 2.74 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 3.34 లక్షల ఎకరాలకు పెరిగింది. మక్కజొన్న సాగు మాత్రం తగ్గింది. నిరుడు ఇదే సమయానికి ఐదు లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలకే పరిమితమైంది.
ఎల్ నినో ఎఫెక్ట్.. వానల్లేవ్.. సాగులేదు
దేశంలో పంటల సాగుపై ఎల్ నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ఎల్ నినో తీవ్ర రూపం దాల్చడంతో వానలు కరువయ్యాయి. మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 21% లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడలేదు. జూలై సగం నెల గడుస్తున్నా వానలు ముఖం చాటేస్తున్నాయి. ఈ నెలలోనూ వర్షా లు కురువకపోవచ్చనే అంచనాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ ముందుగానే పంటలు వేస్తే తర్వాత వర్షాలు కురువకపోతే పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుందని రైతులు భయపడుతున్నారు. దీంతో పంటలు సాగు చేసేందుకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. గతంలో మాదిరిగా వేగంగా పంటలను సాగు చేయడంలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. వ్యవసాయ శాఖ మాత్రం కాగితాలపై సాగు లెక్కలను అధికంగా చూపిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్రాప్ బుకింగ్ మొదలేకాలేదు.. ఇవన్నీ కాకిలెక్కలేనా?
క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, వ్యవసాయ శాఖ ఇచ్చే సాగు లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదనే విమర్శలొస్తున్నాయి. ఒకవైపు, రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో పంటల సాగుకు రైతులు వెనుకంజ వేస్తుంటే, వ్యవసాయ శాఖ మాత్రం ఇష్టారీతిన లెక్కలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ పంటల సాగును ఏ ప్రాతిపదికన, ఏ విధానంలో లెక్కించి వెల్లడిస్తున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈవోలు పంటల సాగును సర్వే చేసి ఇవ్వాలి లేదంటే శాటిలైట్ సర్వే ద్వారా లెక్కించాలి. కానీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు క్రాప్ బుకింగ్ మొదలు పెట్టలేదు. క్రాప్ బుకింగ్ చేయడంలేదు. శాటిలైట్ సర్వే కూడా చేయడంలేదు. మరి వ్యవసాయ శాఖ వారం వారం వెల్లడిస్తున్న ఈ సాగు లెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గత సంవత్సరం సాగు అంచనాపై ఎంతోకొంత పర్సంటేజీ వేసి సాగు లెక్కలు తయారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాగు లెక్కలన్నీ కాకి లెక్కలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కల ఆధారంగానే ప్రభుత్వం పంటల కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఇలాంటి కాకిలెక్కలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం పంటల సాగు వివరాలు
(లక్షల ఎకరాల్లో)..పంటరకం నిరుడు ప్రస్తుతం