హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సంకేతాలిచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ నేతలు సీఎంతో భేటీ అయినట్టు సమాచారం. పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలుచేస్తామంటే బీసీలు అంగీకరించరని, చట్టపరంగా అమలు చేసే అవకాశం ఇప్పట్లో రాదని, ఈ నేపథ్యంలో కోర్టును గడువు కోరడ మే ఉత్తమ మార్గమని వారు ఆలోచన చేసినట్టు తెలిసింది. ఇదే అంశాన్ని పీఏసీ సమావేశంలో చర్చించి అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకోసం ఈ నెల 23 సాయంత్రం గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకొనేందుకు.. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ ఏమీ మాట్లాడటంలేదని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఎన్నికల నిర్వహణకు జాప్యం జరుగుతున్నదనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది.