హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైన అన్నివర్గాలు ఆందోళనల బాటపడుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తుండటంతో ఏంచేయాలో పాలుపోక.. సర్కార్ పోలీసుల ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నది. అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులతో నిండిపోతున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్ మొదలుకొని బషీర్బాగ్ ఫ్లైఓవర్, లక్టీకాపూల్ వరకూ ఎటుచూసినా పోలీసులే కనిపిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈసారి ఏకంగా సుమారు 1,500 మందికిపైగా సిబ్బందిని రంగంలోకి దించినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. గత సెషన్లలోనే దాదాపు 1,000 మంది పోలీసులతో మూడంచెల భద్రతను పెట్టుకున్న ప్రభుత్వం.. ఈసారి ఆ సంఖ్యను పెంచిందని తెలుస్తున్నది. సిటీ పోలీసులు, సిటీ ఆర్మ్ రిజర్వ్, టాస్ఫోర్స్/స్పెషల్ పార్టీ లు, మహిళా పోలీసులు (స్విఫ్ట్టీమ్), క్విక్ రెస్పాన్స్ టీమ్లు భారీగా మోహరించారు. వీరు కాకుండా జిల్లాల నుంచి సైతం పోలీసులను బందోబస్తు కోసం పిలిచారు. అసెంబ్లీ మార్షల్స్ సైతం ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు ముందువరుసలో ఉండటం గమనార్హం.
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసుల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడికి పాల్పడ్డవారిలో అనేకమందికి కనీసం నేమ్ బ్యాడ్జీలు లేవు. కొంతమంది పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చారు. మరికొందరు సూట్లో వచ్చారు. ఎలా వచ్చినా వారు కచ్చితంగా తమ పేరు, ఉద్యోగి క్రమసంఖ్య తెలిపే బ్యాడ్జీని పెట్టుకోవాలి.